ఆదిలాబాద్ : అక్షరతెలంగాణ :
అభివృద్ది విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు నేను రెడి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు ప్రతిసవాల్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, అదే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తూ అప్పులు తెచ్చి ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 14 నెలలు. అయినా పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీ లు అమలు కావడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యలను గెలిపించాలని కోరుతూ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ , జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం , కేంద్ర కార్యవర్గ సభ్యులు ముస్తపు రే అశోక్ ల తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ పట్టభద్రులు సమస్యలను గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరిష్కరించలేదన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ సేల్స్ తో నడిపించేందుకు రూ. 4 నుంచి 6 వేల కోట్ల టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన కాంగ్రెస్ అందులో కొత్తగా నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే భర్తీ చేసిందన్నారు. కేవలం 14 నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో ధరల స్థిరీకరణ ఉండటంతోనే పెట్టుబడులు వస్తున్నాయని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ను చూసి రావడం లేదన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, పూణె, నోయిడాలో దేశఆర్థిక విధానం కారణంగా ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అంతా ప్రధాని మోదీ చలవతోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర , జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, మహిళలు , యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments