థగ్ లైఫ్' మూవీ రివ్యూ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి.

Madupa Santhosh CEO
‘థగ్ లైఫ్' మూవీ రివ్యూ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి.
హైదరాబాద్ : డెస్క్ : అక్షరతెలంగాణ
నాయకుడు.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి. అలాంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన కమల్ హాసన్ మణిరత్నం జోడీ.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కలిసి చేసిన సినిమా.. థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఢిల్లీలో చిన్న రౌడీగా మొదలుపెట్టి పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. తన వల్ల ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కొడుకు అయిన అమర్ (శింబు)ను చేరదీసి తన కొడుకులా పెంచుతాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో శక్తిరాజుకు పెద్ద ఎత్తున శత్రువులూ తయారవుతారు. వాళ్లందరినీ తట్టుకుని శక్తిరాజు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుంటాడు. ఐతే ఒక హత్య కేసులో శక్తిరాజు జైలుకు వెళ్లాల్సి రావడంతో తాత్కాలికంగా అమర్ వ్యాపార బాధ్యతలు చేపడతాడు. శక్తిరాజు బయటికి వచ్చేసరికి అమర్ శక్తిమంతుడు అవుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం మొదలవుతుంది. ఈ దూరం ఎక్కడిదాకా వెళ్లింది? ఇద్దరి మధ్య పోరాటం తప్పని పరిస్థితుల్లో ఎవరు పైచేయి సాధించారు? అన్నది మిగతా కథ, కథనం-విశ్లేషణ: ఎప్పుడో 38 ఏళ్ల ముందు వచ్చిన సినిమా.. నాయకుడు, ఇప్పుడు చూసినా ఆ కథతో.. పాత్రలతో.. ఎమోషన్లతో కనెక్ట్ అవుతాం. టైంలెస్ అనిపించే క్లాసిక్ అది. అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మణిరత్నం- కమల్ హాసన్ జోడీ.. మళ్లీ ఇన్నేళ్ల పాటు కలిసి సినిమా చేయలేదు. ఇంత కాలానికి కలిశారంటే 'నాయకన్' లాంటి కల్ట్ మూవీ అందించకపోయినా.. తమ కాంబినేషన్ కు ఉన్న పేరును చెడగొట్టని సినిమా అయినా అందిస్తారని ఆశిస్తాం. కానీ 'థగ్ లైఫ్' సినిమా చూశాక... మణిరత్నం-కమల్ మళ్లీ కలవకపోయి ఉంటే బాగుండని అనుకోని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 'నాయకన్'ను మించిన సినిమా అని 'థగ్ లైఫ్' గురించి కమల్ ఏ నమ్మకంతో అన్నారో కానీ.. అందులో పదో వంతు స్థాయిలో కూడా నిలవలేని అత్యంత సాధారణమైన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద వందల సార్లు చూసి గ్యాంగ్ స్టర్ డ్రామానే అటు ఇటు తిప్పి వడ్డించేసిన మణిరత్నం.. తన కెరీర్లో తొలిసారిగా 'ఔట్ డేట్' అయిపోయిన భావన కలిగించాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాల్లో సాధారణంగా ఏం జరుగుతుంది? సామాన్యుడిగా ప్రయాణం మొదలు పెట్టిన వ్యక్తి నేర సామ్రాజ్యంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకుంటాడు. చుట్టూ పెద్ద బలగం తయారవుతుంది. అలాగే శత్రువుల సంఖ్యా పెరుగుతుంది. కుట్రలకు తెర లేస్తుంది. ప్రతి ఒక్కరినీ అనుమానించే పరిస్థితి వస్తుంది. నమ్మిన వాళ్లే ద్రోహం చేస్తారు. తర్వాత హీరో ఆ ద్రోహం చేసిన వాళ్ల పనిపడతాడు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ లైన్ మణిరత్నం కూడా ఇప్పుడు ఇదే స్టయిల్లోనే సినిమా లాగించేశాడు. ఐతే ప్రతిసారీ కొత్త కథలతోనే ప్రయాణం చేయడం సాధ్యం కాదు. పాత కథలనే కొత్తగా చెప్పి మెప్పించొచ్చు. మణిరత్నం ఇలాంటి కథను ఎంచుకున్నాడంటే.. దానికి తనదైన ట్రీట్మెంట్ జోడించి ఏదో మ్యాజిక్ చేస్తాడనే అనుకుంటాం. 'థగ్ లైఫ్' మొదట్లో అలాంటి ఆశలే రేకెత్తిస్తుంది. తన దర్శకత్వంలో వచ్చిన 'సవాబ్' తరహాలోనే ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ ను ఆయన రెడీ చేసుకున్న ఆయన.. ఆ బేస్ మీద ఏదో అద్భుతం చేస్తాడని చూస్తాం. కానీ ఈ కథ ఒక మలుపు తిరిగే వరకు ఓ మోస్తరుగా అనిపించి.. ఆ తర్వాత మాత్రం సగటు రివెంజ్ డ్రామాలా మారి ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. ప్రధాన పాత్రల్లో ఏ కొత్తదనం లేకపోవడం.. ఎమోషన్లు ఏమాత్రం పండకపోవడం... దీనికి తోడు ద్వితీయార్ధం అంతా పరమ రొటీన్ గా సాగడంతో 'థగ్ లైఫ్'ను పూర్తిగా చూడడం కూడా కష్టమైపోతుంది. మణిరత్నం నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. 'చెలియా' సినిమా డిజాస్టర్ అయితే.. ఆ తర్వాత వచ్చిన సవాబ్.. పొన్నియన్ సెల్వన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఐతే మణిరత్నం నుంచి ఫెయిల్యూర్లు వచ్చినా ఆయన 'ఔట్ డేటెడ్' అయిన ఫీలింగ్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమా ఇవ్వలేదు. 'చెలియా'.. 'కడలి' లాంటి సినిమాలు కూడా ఆ భావన కలిగించలేదు. కానీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో 'థగ్ లైఫ్' మాత్రం ఆయన వెనుకబడిపోయారని బలంగా అనిపించేలా చేస్తుంది. అసలు ఈ కథలో ఏం కొత్తదనం ఉందని ఆయన ఏరి కోరి ఇన్నేళ్ల తర్వాత కమల్ తో జట్టు కట్టారన్నది అర్ధం కాని విషయం. కమల్ ఐడియా నుంచి డెవలప్ చేసిన ఈ కథలో ఎక్కడా రవ్వంత కూడా కొత్తదనం కనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా అయినా ఏదైనా కొత్తగా ట్రై చేశారా అంటే అదీ లేదు. కనీస ఆసక్తి రేకెత్తించని.. రొటీన్ సన్నివేశాలతో సినిమాను పరమ బోరింగ్ గా మార్చారు. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం.. కథకు ఒక పునాది పడే వరకు 'థగ్ లైఫ్' పర్వాలేదనిపిస్తుంది. కానీ పాత్రల తీరుతెన్నులు చూశాక ఈ కథ ఎలా ముందుకు సాగుతుందని సులువుగా అర్థమైపోతుంది. గ్యాంగ్ స్టర్ అయిన హీరో చుట్టూ ఉండే ద్రోహానికి పాల్పడితే ప్రేక్షకులు ఆశ్చర్యపోవడానికి అవకాశముండేది. కానీ ఆరంభం నుంచే విషయంలో ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. నమ్మక ద్రోహం జరిగాక ఏముంటుంది? హీరో పాత్రలను కనీసం నర్మగర్భంగా చూపించినా.. తర్వాత వాళ్లు నమ్మక పాత్రలేంటన్నది ఓపెన్ అయిపోవడంతో.. తర్వాత వాళ్లేం చేస్తారనే తిరిగొచ్చి ప్రతీకారం తీర్చుకోవడం తప్ప? ద్వితీయార్ధమంతా అదే జరుగుతుంది. మామూలుగా మణిరత్నం సినిమాల్లో ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో.. ఎలా నడుస్తుందో.. ఎలా ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. డైలాగులను కూడా ముందు ఊహించలేం. అక్కడే మణిరత్నం తన ప్రత్యేకతను చూపిస్తాడు. కానీ 'థగ్ లైఫ్'లో మాత్రం ఆయన ఒక సగటు ప్రేక్షకుల స్థాయికి పడిపోవడం విడ్డూరం. ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎవరేం మాట్లాడుకుంటారు.. అన్నది మనం ఎలా ఊహిస్తామో అలా రౌటీన్ గా జరిగిపోతుంది. ముగింపు వరకు ఎక్కడా ఆశ్చర్యాలుండవు. ట్విస్టులూ ఉండవు. ఇక సగటు కమర్షియల్ సినిమాల్లోని హీరో పాత్రలా కమల్ క్యారెక్టర్ని కమల్ తీర్చిదిద్దిన తీరు.. ఆయన మీద తీసిన యాక్షన్ ఘట్టాలు చూస్తే మణిరత్నంకు అసలేమైంది? ఈ సినిమా తీసింది ఆయనేనా అనే సందేహాలు కలుగుతాయి. వయసు మీద పడ్డ వ్యక్తి.. కత్తి పోటుకు గురై.. తుపాకీ గుండు తగిలాక.. వందల అడుగుల ఎత్తు నుంచి బండరాళ్లు.. చెట్ల మీది నుంచి కింద పడ్డ వ్యక్తి కొన్ని నెలల తర్వాత ఎలా బతికి వస్తాడో అర్థం కాదు. వచ్చాక చేసే విన్యాసాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లాజికల్ ఆన్ రియలిస్టిక్ సీన్లను.. అది కూడా మణిరత్నం సినిమాలో చూడడం. ఆయన అభిమానులకు కచ్చితంగా అసహనం కలిగిస్తుంది. అసలే కథలో కొత్తదనం లేదు. పైగా ఎక్కడా ఎమోషన్లూ వర్కవుట్ కాలేదు. దీంతో 'థగ్ లైఫ్' ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. నటీనటులు: కమల్ హాసన్ వయసుకు తగ్గ పాత్రలో తన మార్కు నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఎంతో శ్రద్ధగా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పారు. కానీ ఆయన చేసిన ఐకానిక్ క్యారెక్టర్ల ముందు శక్తిరాజు పాత్ర నిలవజాలదు. కొన్ని సన్నివేశాల్లో కమల్ అద్భుతంగా నటించినా.. కొన్ని సీన్లలో మాత్రం నటనలో నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో కమల్ క్యారెక్టర్ మాత్రమే కాదు.. గెటప్ కూడా తేడా కొట్టేసింది. శింబు పాత్ర గురించి టీం ఒక రేంజిలో చెప్పుకుంది కానీ.. అందులో ఏ విశేషం లేదు. పరమ రొటీన్ పాత్ర అది. శింబు గెటప్ బాగున్నా.. పాత్ర తేలిపోవడంతో తన నటన ఎలివేట్ కాలేదు. అభిరామి తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకుంది. త్రిష పాత్ర సినిమాకు అనవసరం అనిపిస్తుంది. ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ.. కథకు తన పాత్ర ఏ వాల్యూ యాడ్ చేయలేకపోయింది. టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ వృథా అయిపోయాడు. నాజర్.. తనికెళ్ల భరణి కూడా అంతే, అశోక్ సెల్వన్ పాత్ర... నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఐశ్వర్యా లక్ష్మి ఆఖర్లో కొన్ని నిమిషాలే కనిపించినా.. చక్కగా నటించింది. ఆమె పాత్ర ముందు నుంచే ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంకేతిక వర్గం: ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు తగ్గట్లే సాగింది. కొన్నేళ్ల నుంచి తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేకపోతున్న రెహమాన్.. ఈ చిత్రంలోనూ నిరాశపరిచాడు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మొక్కుబడిగా సంగీతం అందించాడనిపిస్తుంది. థీమ్ సాంగ్ ఒకటి బాగున్నా.. మిగతావి సోసోగా సాగాయి. నేపథ్య సంగీతంలోనూ అంత స్పెషాలిటీ ఏమీ లేదు. సినిమాకు అతి పెద్ద ఆకర్షణ అంటే మాత్రం.. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణమే. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశంలో క్వాలిటీ కనిపిస్తుంది. కానీ కమల్-మణిరత్నం కలిసి రాసిన కథలోనే ఏ విశేషం లేకపోయింది. రొటీన్ కథకు.. అంతే రాటీన్ ట్రీట్మెంట్ తో మణిరత్నం ఆశ్చర్యపరిచాడు సినిమా మెప్పించినా మెప్పించకపోయినా.. కొత్తగా ప్రయత్నిస్తాడని పేరున్న మణిరత్నం.. ఈ చిత్రంలో మాత్రం రొటీన్ దారిలో సాగిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేదే.
Comments