ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
అర్హులందరికీ రేషన్, పౌష్టికాహారం అందేలా చర్యలు
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, పౌష్టికాహారం, ఆహార భద్రత పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు రోజుల క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న గుడ్ల నాణ్యతను సమావేశంలో చైర్మన్ పరిశీలించారు.
ఈ సందర్బంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రేషన్ దుకాణాల్లో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేసి, సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్‌ఫ్రీ నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల హాస్టళ్లలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా భోజన వేళలు, మెనూ అమలు, వంటగది పరిశుభ్రత, వంట సామగ్రి నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో విద్యార్థుల సంక్షేమం కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఫుడ్ కమిషన్ సభ్యులు ఒరగంటి ఆనంద్ మాట్లాడుతూ, ఆహార భద్రత చట్టం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం పొందే హక్కు కల్పించబడిందన్నారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, అవసరమైన వైద్య సేవలు, ప్రత్యేక సంరక్షణ అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు, పాఠశాల విద్యార్థులకు నిర్దేశిత మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉందన్నారు. ఆహార భద్రత హక్కుల అమలులో ఉల్లంఘనలు చోటుచేసుకున్నా, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఫుడ్ కమిషన్‌కు ఉందన్నారు. అవసరమైన సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలోని 2,566 రేషన్ దుకాణాల ద్వారా 2,27,477 రేషన్ కార్డులకు చెందిన 7,44,404 యూనిట్లకు ప్రతి నెల సుమారు 4,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉట్నూర్, ఆదిలాబాద్ డివిజన్లలో చెరో 10 ఖాళీలు ఉన్నాయని వివరించారు.
కొత్తగా జారీ చేసిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేస్తున్నామని, రేషన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం, నిర్దేశిత మెనూను తప్పనిసరిగా అమలు చేయడం, కుక్స్, హెల్పర్లు, వార్డెన్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ నిర్వహించడం, కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయడం, మెనూ, టోల్‌ఫ్రీ నంబర్లను ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలు, హాస్టళ్లలో పోషకాహారం, పరిశుభ్రత, మౌలిక వసతుల పరిస్థితులను ‘పోషణ్ చర్చ’ యాప్ ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక వికాసం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థుల ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ కమిషన్ చైర్మన్, సభ్యులకు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్.చిత్రు, డీఆర్‌ఓ స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, డీఆర్‌డీఓ రాథోడ్ రవీందర్, డీఎస్‌వో నందిని, డీఎం సుధారాణి, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు సోనియా, సునీత, సీడీపీవోలు, ఎంఈవోలు, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
బాల్ వివాహ్ ముక్త్ భారత్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ‘బాల్య వివాహ రహిత గ్రామం’ అంశాన్ని ఎజెండాలో చేర్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన నిబంధనలు, బాల్య వివాహాల నివారణలో గ్రామ పంచాయతీలు, ప్రజలు, సమాజం పాత్రపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ చైల్డ్ రైట్స్ అసోసియేట్ దేవిశ్రీ, ఐసీపీఎస్ అసిస్టెంట్ కమ్ డీఈవో ప్రేమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments