ఆదిలాబాద్: అక్షరతెలంగాణ
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు.
గురువారం గుడిహత్నూర్ మండలం ధారమడుగు గ్రామంలో ఓ ఎస్ ఎఫ్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మోదుగ ఆకుల విస్తర తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలు, తయారీ ప్రక్రియ, మహిళా సంఘాల సభ్యులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా లభించే మోదుగ ఆకులను సేకరించి వాటితో విస్తరాలు తయారు చేయడం ద్వారా మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఇలాంటి ఉపాధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. మోదుగ ఆకులతో తయారు చేసే విస్తరాలు పర్యావరణహితమైనవని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ వాటిని జీవనోపాధికి అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ధారమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన నీటి కుంటను సందర్శించి పరిశీలించారు. నీటి కుంట ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత వంటి అంశాలపై సంబంధిత అధికారులు, గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేలా నీటి వనరులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి వనరుల సంరక్షణతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ రవీందర్ రాథోడ్, ఈపీఆర్ శివరామ్, తహశీల్దార్ కవితారెడ్డి, స్థానిక సర్పంచ్ సీతాబాయి, సంబంధిత అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments