ఆధార్ సేవలు ప్రజలకు మరింత చేరువలో - అదనపు కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌. చిత్రు

Madupa Santhosh CEO
ADB : ఆదిలాబాద్‌లో ప్రత్యేక ఆధార్ సేవా కేంద్రం ను  ప్రారంభించిన  అదనపు కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌. చిత్రు
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ 
ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆధార్‌కు సంబంధించిన సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ప్రత్యేక జిల్లా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌. చిత్రు తెలిపారు. మంగళవారం స్థానిక విద్యానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆధార్ సేవల కోసం ప్రజలు హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కొత్తగా ఆధార్‌ నమోదు, ఆధార్‌లోని వివరాల సవరణ, చిరునామా తదితర వివరాల నవీకరణ, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ వంటి సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చని పేర్కొన్నారు.
కేంద్రంలో ఏడుగురు ఆధార్‌ ఆపరేటర్లు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు సుమారు 300 నుంచి 400 మంది వరకు ఆధార్‌ నమోదు, వివరాల నవీకరణ తదితర సేవలు పొందేలా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.

ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రం వారంలో ఏడు రోజులూ, ఆదివారంతో సహా పనిచేస్తుందని అదనపు కలెక్టర్‌ తెలిపారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తమకు అనుకూలమైన రోజున ఆధార్ సేవలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రంలో ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ మేనేజర్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆధార్‌కు సంబంధించిన సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
కొత్త ఆధార్‌ నమోదు కోసం ఎలాంటి రుసుము ఉండదని అదనపు కలెక్టర్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా, తప్పనిసరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ ఉచితంగానే ఉంటుందని తెలిపారు. యూఐడీఏఐ నిర్దేశించిన రుసుముల మేరకే ఇతర ఆధార్ సేవలు పొందాలని, నిర్ణీత రుసుములకు మించి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. నిబంధనల మేరకు మాత్రమే సేవలు అందించాలని కేంద్ర నిర్వాహకులకు ఆదేశించారు.

జిల్లా ప్రజలు ప్రత్యేక ఆధార్ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆధార్‌ సంబంధిత సేవలను సులభంగా పొందాలని అదనపు కలెక్టర్‌ కోరారు.
ఈ కార్యక్రమంలో ఈడీఎం రవి, మేనేజర్‌ శ్రవణ్‌, శ్రీనివాస్‌, హరినాథ్‌, మాజర్‌ హుస్సేన్‌, కుందన్‌ తదితరులు పాల్గొన్నారు.
Comments