జగిత్యాల: అక్షర తెలంగాణ
షార్ట్‌సర్క్యూట్‌తో రూ.15 లక్షల ఆస్తి బుగ్గిపాలు
ఆసుపత్రిలో తండ్రి.. ఇంట్లో అగ్నిప్రమాదం.. కట్టుబట్టలే మిగిలిన కుటుంబం
బాధితులకు అండగా
రెవిన్యూ,గ్రామ సర్పంచ్,కుల సంఘం,
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
ఎండపల్లి గ్రామం:
అగ్నిప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి,కళ్లముందే కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతైంది.బంగారం, వెండి ఆభరణాలు, నగదు,దుస్తులు, విలువైన పత్రాలు సహా ఇంట్లోని సామగ్రి అంతా కాలి బూడిదైంది. సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎండపల్లి మండల కేంద్రంలో దాసరి కళ్యాణి–కొమురయ్య కుటుంబానికి ఎదురైన ఈ విషాద ఘటన గ్రామస్థులను కలచివేసింది.
తండ్రి చికిత్స కోసం తెచ్చిన డబ్బులూ బూడిదే!
వివరాల్లోకి వెళితే.. బాధితుడు కొమురయ్య తండ్రి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి వైద్య ఖర్చుల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బులను ఇంట్లోని బీరువాలో భద్రపరిచి అనంతరం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి వెళ్లారు అని బాధితుల సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే ఇల్లు మొత్తం వ్యాపించాయి. ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదు,దుస్తులు, విలువైన డాక్యుమెంట్లు సహా సామగ్రి మొత్తం కాలిపోయింది. కుటుంబం కోసం దాచుకున్న సొమ్ముతో పాటు నిత్యావసర వస్తువులు సైతం బూడిద కావడంతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది.
కట్టుబట్టలే మిగిలాయి.
కన్నీరుమున్నీరైన బాధితులు
కష్టకాలంలో తండ్రి వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ అగ్నిప్రమాదం మరో పిడుగులాంటి దెబ్బగా మారింది.కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలకపోవడంతో బాధితురాలు కళ్యాణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు చూసి గ్రామస్థులు సైతం చలించిపోయారు.
బాధితులకు అండగా కుల సంఘం, సర్పంచ్
అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు.తక్షణ సహాయంగా రెవెన్యూ సిబ్బంది నిత్యావసర సరుకులను అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ కుల సంఘం తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. గ్రామ సర్పంచ్ సునీత జెలందర్ రెడ్డి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి పలువురు ముందుకు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
సకాలంలో గ్రామంలోని ట్రాక్టర్ ట్యాంకర్‌తో మంటల అదుపునకు యత్నం ఈ క్రమంలో పంట పొలాలకు మందులు పిచికారీ చేసే ట్రాక్టర్ ట్యాంకర్ అగ్నిమాపక వాహనానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడింది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ట్రాక్టర్ ట్యాంకర్ నిర్వాహకులను గ్రామస్థులు అభినందించారు.సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది వచ్చేసరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
ఈ ఘటనపై స్పందించిన రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎడ్ల అనిల్ కుమార్,ఆర్ఐ అన్వేష్, సెక్రటరీ కొమురయ్య, పోలీసు సిబ్బంది,వీపీఓ ప్రతాప్ పాల్గొన్నారు.
ఒకవైపు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరోవైపు ఇల్లు పూర్తిగా దగ్ధమై కుటుంబం నిరాశ్రయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని,ఇల్లు కోల్పోయిన కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి పునరావాసం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments