ప్రజలు, ప్రభుత్వానికి వారధి గా పాత్రికేయులు - మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

Madupa Santhosh CEO
ADB: ప్రజలకు ప్రభుత్వానికి వారధి పాత్రికేయులు- మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి 
ఆదిలాబాద్‌: అక్షర తెలంగాణ 

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం
 
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సమాజాభివృద్ధిలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. .

జిల్లా కేంద్రంలోని టీటీడీసీ హాల్‌లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల శిక్షణ తరగతులకు  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌తో కలిసి  కార్యక్రమంలో ఆయన
పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. తప్పుడు ప్రచారాలకు తావులేకుండా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు.
జిల్లాలో త్వరలో పత్తి, సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని కోరారు. కొనుగోళ్లు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారాన్ని అందించడంలో పాత్రికేయులు సహకరించాలని అన్నారు.
జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని, వారికి ఇంటి స్థలాలు మంజూరు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య కార్డులు అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మీడియా అసోసియేషన్‌ ప్రతినిధులు మాధస్తు రాజేశ్వర్‌, నూకల దేవేందర్‌, వినోద్‌తోపాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments