టీమిండియాపై "ఇది ఒక గెలుపేనా"....ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫైర్
ఐదు టీ20 సిరీస్ టీమిండియా ఇంగ్లాండ్ తో ఆడుతోంది. దీనిలో భాగంగానే మొదటి రెండు టీ20ల్లో టీమిండియా విజయం సాధించగా, మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది.
కీలకమైన నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.దీంతో మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్కు 181 పరుగుల టార్గెట్ విధించింది
ఇంగ్లాండ్ సైతం ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించింది.ఒకనొక సమయంలో ఇంగ్లాండ్ విజయం సాధించేలా కనిపించింది. 60 పరుగుల వరకు ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు విజృంభించి వికెట్లు తీయడంతో భారత జట్టుపై ఒత్తిడి తగ్గింది. ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో శివమ్ దూబే గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో కంకషన్ సన్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను భారత్ తీసుకుంది.ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నహర్షిత్ రాణా మూడు వికెట్లను పడగొట్టాడు. తొలి ఓవర్ రెండో బంతికే లియామ్ లివింగ్ స్టోన్ కీలక వికెట్ తీయడంతో మ్యాచ్ అక్కడి నుంచి మలుపు తిరిగింది. హర్షిత్ రాణా కారణంగానే టీమిండియా విజాయాన్ని నమోదు చేసింది. అయితే హర్షిత్ రాణాను తీసుకోవడంపై ఇంగ్లాండ్ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
హర్షిత్ రాణా ఎంపిక లైక్ టు రీప్లేస్ మెంట్ కాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. దూబే ఆల్ రౌండర్ అయినప్పటికీ టీమిండియా ఇలా పర్ఫెక్ట్ బౌలర్ను ఎంపిక చేయడం సరైంది కాదని జోస్ బట్లర్ వాదిస్తున్నాడు.హర్షిత్ రాణా విషయంలో మ్యాచ్ రిఫరీ మరింత స్పష్టత ఉండాల్సిందని జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు.కెవిన్ పీటర్సన్, మైఖేల్ వాన్ ,అలిస్టర్ కుక్ వంటి ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు సైతం టీమిండియా నిర్ణయాన్ని తప్పుపట్టారు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను కంకషన్ రీప్లేస్మెంట్గా ఎలా అనుమతించారో అర్థం కావడం లేదని వారు కామెంట్స్ చేశారు. టీమిండియా నుంచి ఎవరూ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.
Comments