విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Madupa Santhosh CEO
 అదిలాబాద్ జిల్లా, అక్షరతెలంగాణ : 

విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి

విద్యార్థులు చిన్ననాటి నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా తమ  భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం నాడు ఆదిలాబాద్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు పుస్తక పరిక్రమ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సంచార పుస్తక ప్రదర్శన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు పుస్తక ప్రదర్శన లోని పుస్తకాలు చదవడం తో పాటు, అమ్మా నాన్న లు ఖర్చుల కొరకు ఇచ్చే డబ్బులను పొదుపు చేసి పుస్తకాలు కొనుగోలు చేసి ఇంటివద్ద చదివే అలవాటు చేసుకోవాలని అన్నారు. తాను కూడా పుస్తకాలు చదవడం ద్వారానే ఈ స్థాయికి వచ్చానని విద్యార్థులకు తెలిపారు. సంచార పుస్తక ప్రదర్శన వాహనం జిల్లాలో నాలుగు రోజులు వివిధ పాఠశాలలను సందర్శిస్తుందని, దీనిని ఆయా పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకొనే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో బాలికల ఉన్నత పాఠశాలలో పుస్తకమిత్ర సంస్థ అందించిన ₹ 40000 ల విలువగల పుస్తకాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పిల్లల్లో సృజనాత్మక రచన పెంపొందించడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కథా రచనపై అవగాహన కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ అశోక్, దేవ్ రావు లు నిర్వహించారు. పిల్లలచే కథలు రాయించారు. ఇంకను విద్యార్థులకు పుస్తక పఠనం అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖాధికారి టి. ప్రణీత, మండల విద్యాధికారి సోమయ్య, ప్రధానోపాధ్యాయులు కె. రమేష్ రెడ్డి, నేషనల్ బుక్ ట్రస్ట్ సమన్వయ కర్తలు అశోక్, దేవ్ రావు, సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments