భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి :
భద్రాచలం: అక్షరతెలంగాణ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ బి.రమేష్, కానిస్టేబుల్ సిహెచ్.రామారావు, మరో వ్యక్తి కార్తీక్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వై.రమేష్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 19 తేదీన బూర్గం పాడు నుండి భద్రాచలం వైపుగా మొరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్ కి తీసుకువచ్చారని తెలిపారు.
ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయ డానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు రూ.30వేలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి రూ.20వేలు ఇవ్వాలని, ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదు దారుడైన వాహనం యజమాని నుండి రూ.20వేలు లంచం ఫోన్ పే చేయించినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ బి.రమేష్, కానిస్టేబుల్ సి.హెచ్. రామారావు, ప్రైవేట్ వ్యక్తి డి.కార్తీక్ లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సిఐ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదు దారుడు నుండి 20వేల రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డిఎస్పి రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారు లు మీడియా సమావేశంలో తెలిపారు.
Comments