HYD ' పసిపిల్లవా డి మనస్థత్వం ' పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచనలు
హైదరాబాద్ : అక్షరతెలంగాణ :
పసి పిల్లలు బాల్యంలో తాము కోరుకున్నదే కావాలనుకుంటూ, మారం చేస్తారు అలాగే ప్రభుత్వం తాము అనుకున్నదే జరగాలంటూ గోల చేయడాన్ని మంకుపట్టు పట్టడం అంటారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం విషయంలో ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కూడా అదే పసిపిల్లవాడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నది. యాభై ఏళ్ల క్రితం విశ్వ విద్యాలయానికి కేటాయించిన భూమి తమదేనని వాదించడం మొండి పిల్లవాడి మనస్తత్వానికి అద్ధం పడుతున్నది. HCU కు చెందిన భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో వెనక్కు తగ్గకుండా TGIIC కి కేటాయించిన 400 ఎకరాల భూమి మాత్రమే కాదు, యూనివర్సిటీ స్థలమంతా కూడా తమదేనని వాదిస్తున్నది. నిజానికి ఆ భూమి మాత్రమే కాదు,విద్యాలయ భవనాలన్ని కూడా
ప్రభుత్వానివే. అంతమాత్రాన వాటి భూములను విద్యారంగానికి సంబంధం లేని సంస్థలకు కేటాయించరాదన్న నిబంధనను మరిచిపోతున్నది. పాలకులకు ఈ విషయం ఎందుకు అర్ధం కావడం లేదు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధి కోసం 1974 సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం HCU భూములను అన్యాక్రాంతం చేస్తామనడం పూర్తిగా అనైతికం, హాస్యాస్పదం . హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వివాదంలో సుప్రీం కోర్టు కలగజేసుకొని దానిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం పై మండిపడుతూ వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఖంగు తిన్న రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా మేధావులతో, ప్రజా సంఘాలతో చర్చించేందుకు ముగ్గురు రాష్ట్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటివరకు HCU లో అటవీ భూమే లేదని వాదించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ లంగ్స్ లాంటి ప్రాంతాన్ని బయోవర్సిటీగా మార్పు చేస్తూ ఎకో పార్కుగా అభివృద్ధి చేయాలని సూచన చేసింది. మరో ముందడుగు వేసి HCU లోని నాలుగు వందల ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించి రాజీవ్ గాంధీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్కుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిలో పలు రకాల పక్షులు, సీతకోకచిలుకలు వంటివికూడా ఉండే విధంగా విభిన్నమైన పూల తోటలు ఏర్పాటు చేయాలని సూచన చేసింది. అంతటితో ఆగకుండా అవసరమైతే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని
అక్కడి నుండి తరలించాలనే అనాలోచిత, అపరిపక్వ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. HCU కు చెందిన 2300 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించబడి ఉన్న స్థలాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలన్న ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చింది.ఈ విధంగా విద్యార్థి లోకంలో, పౌర సమాజంలో ఆగ్రహ జ్వాలను రగిలించే, రెచ్చగొట్టే ప్రతిపాదనలకు నడుం బిగించింది. ఇలాంటి ప్రతిపాదన లేదా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుంది అన్నది నిర్వివాదాంశం. ప్రజలలో వ్యతిరేకతను మూట కట్టుకునే ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది? అంటే ప్రభుత్వ 6 గ్యారంటీల హామీఅమలు విషయంలో పడుతున్న ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు కావచ్చు. ఏడవ హామీ విషయంలో పౌర సమాజం నుండి పెరుగుతున్న ఒత్తిడి మరో కారణం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం చేసే ప్రత్యామ్నాయ మార్గాన్వేషణ కూడా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అంశమే అన్నది పాలకులు మరవరాదు.
విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు, అధ్యయనాలకు కేంద్రాలు. వీటికి కావలసిన ప్రశాంత వాతావరణం, భౌతిక వనరులు సమకూర్చడం పాలకుల బాధ్యత. తగినంత స్థాయిలో బోధనా సిబ్బందిని నియమించడం అవసరం. ఇందుకుగాను ప్రభుత్వ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి విద్యా రంగ అభివృద్ధికి కృషి చేయాలి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది, ఉపాధ్యాయుడు/ అధ్యాపకుడు అందుకు దోహదకారి అని స్పష్టం చేసిన కొఠారి కమిషన్ నివేదికను మరో మారు మననం చేసుకోవడం ఈ సందర్భంలో ఎంతైనా అవసరం. ఇప్పటికే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు బోధనా సిబ్బంది కొరతతో తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వ రంగంలో విద్య కుంటుపడుతుంది. ప్రైవేట్ రంగంలో బలపడుతుంది. ఈ కారణంగా అనేకమంది దళిత బహుజన, ఆదివాసీలు ఉన్నత, సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. నైతిక విలువల పతనం కొనసాగుతుంది. సామాజిక బాధ్యత కొరబడుతుంది. ఇది దేశ భద్రతకు, భవిష్యత్ కు మరింత ప్రమాదకరం. ఈ విషయాన్ని సున్నితంగా అర్థం చేసుకొని, భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడుతున్న విశ్వ విద్యాలయాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులదే.. రానున్న భావితరాలకు భవిష్యత్తు ను చూపేవిధంగా ప్రభుత్వ ఆలోచలు ఉండాలి తప్ప ప్రస్తుత మొండివైఖరి..విధానాలు....అనాలోచితంగా అభద్రత కు తావివ్వకుండా ఉండాలి..
......సంపాదకులు: మడుపు సంతోష్
Comments