సామాజిక న్యాయ సాధన దిశ లోనే ప్రతిపైసా ఖర్చు చేస్తున్నాం - మంత్రి సీతక్క

Madupa Santhosh CEO
National: సామాజిక న్యాయ సాధ‌న దిశ‌లోనే ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేస్తున్నాం - మంత్రి సీతక్క 
డెహ్రాడూన్ : అక్షరతెలంగాణ : 
ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలుడెహ్రాడూన్ చింత‌న్ శివిర్ లో ప్ర‌సంగం వివ‌రించిన మంత్రి
అభాగ్యుల అభ్యున్న‌తిలో  తెలంగాణ రాష్ట్రం రోల్ మోడ‌ల్ గా నిలుస్తుంద‌న్నారు మంత్రి సీత‌క్క‌.  సామాజిక న్యాయ సాధ‌న దిశ‌లోనే ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. సామాజిక న్యాయం, సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా. వీరేంద్ర కుమార్ అద్యక్షతన  డెహ్రాడూన్ లో జరిగిన చింతన్ శివిర్ కార్యక్రమంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ప్ర‌సంగించారు. 
తెలంగాణ రాష్ట్రంలో వయవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను వివ‌రించారు. ఆయా వ‌ర్గాల సంక్షేమం కోసం కేంద్ర స‌హ‌కారాన్నిఅభ్య‌ర్దించారు. 

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషిని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు. సామాజిక‌, ఆర్దిక‌, రాజకీయ అవ‌కాశాల్లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే సామాజిక న్యాయమ‌ని... ఆ దిశ‌లో రెండు కీల‌క బిల్లుల‌కు తెలంగాణ అసెంబ్లీ ఏక‌గ్రీక‌వంగా ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. బీసీ వ‌ర్గాల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతం వ‌ర‌కు పెంచ‌డంతో పాటు, 30 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లును ఆమోదించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ రెండు బిల్లులు సామాజిక న్యాయాన్ని అమ‌లు చేసే దిశ‌లో గొప్ప మైలు రాల్లుగా నిలుస్తాయ‌న్నారు మంత్రి సీత‌క్క‌. 

సంప‌న్నులు తినే స‌న్న బియ్యాన్ని ప్ర‌జా పంపిణి వ్య‌వ‌స్థ ద్వారా కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో స‌న్న బియ్యం పేద‌ల‌కు అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. దీంతో పాటు అణ‌గారిన వ‌ర్గాలు, పేద‌ల ఆర్దిక భారాన్ని త‌గ్గించేందుకు రూ.500 కే గ్యాస్ సిలిండ‌ర్, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్, మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఇలా ఎన్నో ప‌థ‌కాల‌తో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తూ సామాజిక న్యాయానికి ప‌ర్యాయ ప‌దంగా నిలుస్తోందన్నారు.   "దళితులు, ఆదివాసీలు, మహిళలు చారిత్రాత్మకంగా అణచివేయబడ్డారు. వివక్షకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్నారు.

 సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ట్రాన్స్ జెండ‌ర్లు ఇప్పటికీ నిర్లక్షానికి గుర‌వుతున్నారు. భారత రాజ్యాంగం ఈ అన్యాయాలను గుర్తించి న్యాయమైన, సమ్మిళిత సమాజం కోసం కృషి చేస్తోంది. అందుకే  నిజమైన సామాజిక న్యాయం వైపు సమిష్టిగా కదలడం మన విధి" అన్నారు మంత్రి సీత‌క్క‌. సమానత్వ సాధ‌న దిశ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతి ఒక్క‌రి సంర‌క్ష‌ణ‌, సంక్షేమం కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం  నిబద్ధతతో ప‌నిచేస్తుంద‌న్నారు సీత‌క్క‌. 
దాతృత్వంలో కాకుండా సామాజిక న్యాయం ఎత్తి ప‌ట్టే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. 
మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లుగా, అభివృద్ధి అంటే కర్మాగారాలు, ఆనకట్టలు లేదా రోడ్ల నిర్మాణమే కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచ‌డం, నైతిక విలువ‌ల‌ను పెంపొందిచ‌డమ‌న్నారు సీత‌క్క‌. అభాగ్యుల అభ్యున్న‌తి కోసం తెలంగాణ రాష్ట్రం రోల్ మోడ‌ల్ గా నిలుస్తుంద‌న్నారు. 

దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బ‌తికేలా ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి సీత‌క్క చెప్పారు. 
రూ. 300 కోట్ల‌తో రాజీవ్ యువ వికాసం ద్వారా 25 వేల మందికి స్వ‌యం ఉపాధి క‌ల్పిస్త‌మ‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కంతో పాటు ప్ర‌తి రంగంలో దివ్యాంగుల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న నిధులు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. 

తెలంగాణ‌లో 32.69 ల‌క్ష‌ల మంది వ‌యోవృద్దుల నెల‌వారి పెన్ష‌న్ కోసం గ‌త ఏడాది రూ.  3056.94కోట్ల‌ను వెచ్చించిన‌ట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం అంద‌చేస్తున్నామ‌న్నారు. పిల్ల‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటున్న వృద్దులకు న్యాయ స‌హాయం అంద చేస్తున్న‌ట్లు తెలిపారు. 
ట్రాన్స్ జెండ‌ర్ల సంక్షేమం కోసం ప్ర‌తి జిల్లాలో మైత్రి క్లినిక్ ల ఏర్పాటుతో పాటు 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. 2 ల‌క్ష‌ల స‌బ్సిడీతో 72 మంది కి ఉపాధి క‌ల్పించిన‌ట్లు తెలిపారు. సామాజిక న్యాయ సాధ‌న దిశ‌లోనే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సీత‌క్క‌తో పాటు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, వ‌యోవృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండ‌ర్ల సాధికార శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ శైల‌జ పాల్గోన్నారు
Comments