ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహించాలి : రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:

Madupa Santhosh CEO
  NRML : ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి:  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి : 
నిర్మల్: అక్షరతెలంగాణ 
  భూ భారతి చట్టం అమలులో భాగంగా మే 5 నుంచి 20 వరకు జిల్లాలోని ఒక్కో మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
      శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌లతో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ (ఎంసీఆర్ ఎచ్ఆర్డీ) నుండి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు 12,759 దరఖాస్తులు వచ్చాయని, రాష్ట్రవ్యాప్తంగా రాబోయే సదస్సుల్లో సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత పాటించాలని, ప్రతి దరఖాస్తును మే నెలాఖరులోపు పూర్తిగా పరిశీలించి, జూన్ 2 నాటికి పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే ప్రజలకు సాయం చేసేందుకు గ్రామ స్థాయిలో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూముల్లో పోజిషన్ ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టాలు ఉండి పోజిషన్ లేకపోయినా, తగిన దశల వారీగా పరిశీలన చేయాలని అన్నారు.
       మే 5న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు విస్తృత చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగు నీరు, పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు, విద్యుత్ సరఫరా కల్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రశ్నా పత్రాల రక్షణ కోసం సీసీ కెమెరాలు, పోలీసు భద్రత కల్పించాలని, మధ్యాహ్నం 1.30 తర్వాత గేట్లు మూసి, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోనికి అనుమతించాలని తెలిపారు.
      ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మంజూరైన 51 వేల ఇండ్లలో 10 వేల ఇంటి నిర్మాణాలు మాత్రమే మొదలయ్యాయని, మే 10 నాటికి ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హుల జాబితా ప్రకటించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రజలకు చెల్లింపులు సమయానికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
       భూ సేకరణ కింద ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ చేయాలని, భూ సర్వే, ఆర్‌ఎస్‌ఆర్ ఎక్సెస్ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. అసైన్డ్ భూముల విక్రయాలపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
         ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, భూ భారతి చట్టం కింద దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని, అధికారుల సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షపై గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల సమాచారం పత్రికలు, మీడియా ద్వారా అభ్యర్థులకు తెలియజేయాలన్నారు.
       ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ లు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, హోసింగ్ పిడి రాజేశ్వర్, ఏ డి సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. ఆ 0
Comments