అక్షర తెలంగాణ: డిజిటల్ న్యూస్:
ప్రజా పాలన ప్రతిబింబించేలా గ్రామసభలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ జీవిత బీమా' అమలు
ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి ఆదేశం.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా గ్రామసభలను నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం' అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి
మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి ప్రతిష్టాత్మకమైన 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్నిప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
గ్రామసభలే ప్రజా వేదికలు:
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే గ్రామసభల్లో ప్రజలకు అందించే సమాచారం ఏకరూపంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశం వివరించడంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ సభలను ముఖ్యమంత్రి సందేశంతో ప్రారంభించి, వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్ల వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో చదివి వినిపించాలని, లబ్ధిదారుల అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని చెప్పారు.
విద్యా, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని భట్టి విక్రమార్క తెలిపారు. సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజల్లో ప్రభుత్వంపై భరోసా కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేయాలని, ప్రగతి ప్రణాళిక అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్త సభలు:సీఎస్ రామకృష్ణారావుఅనంతరం సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, అదే స్ఫూర్తితో ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామసభలతో పాటు మున్సిపాలిటీల్లో వార్డు సభలు కూడా నిర్వహించి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను రికార్డు చేయాలన్నారు. సాగులో నూతన పద్ధతులు, పంట మార్పిడి, ఆర్గానిక్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మటె, డీఆర్డీఏ పీడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments