ప్రజా ఆరోగ్యమే అక్ష్యం: ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా:

Madupa Santhosh CEO
ADB : ప్రజారోగ్యమే లక్ష్యం:  ఆరోగ్య ఆదిలాబాదుగా తీర్చిదిద్దాలి - కలెక్టర్ రాజర్షిషా.
ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ: 

ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలి: ఎంపీ గోడం నగేష్.
ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాదుగా తీర్చిదిద్దాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా వైద్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ఆదిలాబాదు పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాదు నియోజకవర్గ శాసన సభ్యులు పాయల శంకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాదుగా తీర్చిదిద్దాలని, నిన్నటి నుండి ప్రారంభమైన ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సేఫ్ మదర్ హుడ్, ఎయిడ్స్ నివారణ, ఆయుష్ వంటి అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రిమ్స్ ఆసుపత్రి జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో జరుగుతున్న శస్త్రచికిత్సలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు చేపట్టిన 'సంకల్ప' ప్రోగ్రామ్ ద్వారా రిమ్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయి నుండే పిల్లలు గుట్కా, పాన్ మసాలా, మద్యం, గంజాయి వంటి అలవాట్లకు లోనవుతుండటం ఆందోళనకరమని, ఇటువంటి వారిని గుర్తించి రిమ్స్ లేదా స్వచ్ఛంద సంస్థలు నడిపే డి-అడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు.
అలాగే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉందని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను సక్రమంగా వాడేలా చూడాలన్నారు. ఆర్.ఎం.పిల వద్దకు వెళ్లి అనవసరమైన యాంటీబయాటిక్స్, ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, తగినంత నీరు తాగడం, 6 నుండి 7 గంటల నిద్ర, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ యోగా, వ్యాయామం వంటివి అలవర్చుకోవాలని సూచించారు.
ఆదిలాబాదు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ, మానవ జీవితం చాలా స్వల్పమైనదని, డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం సగటు జీవితకాలం 60 నుండి 70 ఏళ్లకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇది కేవలం సంబరాల కోసం కాకుండా మన ఆరోగ్యంపై మనకు అవగాహన కలిగించే 'అలారం' వంటిదని పేర్కొన్నారు. నేటి సమాజంలో 30-40 ఏళ్లకే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగితే ప్రభుత్వం వైద్యం కోసం చేసే భారీ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాత్ర కీలకమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యులను ఎంతగానో నమ్ముతారని, వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాలలోని ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్సకు పరిమితం కాకుండా హై డోస్ మందులు, పెయిన్ కిల్లర్లు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తోందని హెచ్చరించారు. గతంలో బజార్ హత్నూర్, గాదిగూడ వంటి మండలాల్లో కిడ్నీ సమస్యలతో పలువురు మృతి చెందడానికి విదేశాల నుండి వచ్చిన అనర్హులైన వ్యక్తులు చేసే వైద్యమే కారణమని గుర్తు చేశారు. యువత గంజాయి, గుట్కా, సిగరెట్లు వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారని, దీనిపై కఠిన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరూ నడక, యోగా ధ్యానం  వంటి అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మనిషి ఏ రంగంలో ఉన్నా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి నుండి బయటపడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, నడక వంటి అంశాలను సమన్వయం చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని, 2014-15లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ప్రాముఖ్యతను ప్రపంచ వేదికలపై చాటిచెప్పినప్పుడు మొదట్లో కొందరు విమర్శించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే, ఐక్యరాజ్యసమితిలో యోగాను గుర్తించిన తర్వాత, శాస్త్రీయంగా దీనివల్ల మందుల వాడకం దాదాపు 44 శాతం తగ్గిందని అనేక పరిశోధనలు నిరూపిస్తున్నాయని వివరించారు. యోగాను అలవరచుకోవడం ద్వారా సుమారు 50 నుండి 60 శాతం వరకు రోగాల బారిన పడకుండా ఉండవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా సమయానికి ఆహారం, నిద్ర  తీసుకోవాలని సూచించారు. బయట ఫుడ్ తీసుకోకుండా ఆరోగ్య పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా టిబి నియంత్రణపై ప్రతిజ్ఞ చేసి, ఆయుష్ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. తదుపరి ఉత్తమ వైద్య సేవలు అందించిన పలువురు వైద్యులకు, సిబ్బందికి, నిక్షయ మిత్రాలకు కలెక్టర్, ఎంపీ ప్రశంస పత్రాలను అందజేశారు.

అనంతరం నూతన టిబి ఎక్స్ రే యంత్రాన్ని కలెక్టర్, ఎంపీ ఆవిష్కరించి, టిబి వ్యాధిగ్రస్థులకు నిక్షయా పోషన్ కిట్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, లీగల్ అడ్వైజర్ దాసరి గంగారం, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments