బీజేపీ కార్యాలయాలు, నాయకుల పై దాడులు హేయమైన చర్య - ఎమ్మెల్యే పాయల్ శంకర్

Madupa Santhosh CEO
ADB: బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులు హేయమైన చర్య -పాయల్ శంకర్
హైద్రాబాద్: అక్షర తెలంగాణ 
నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి పిరికి పందల చర్య 
నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై దాడి చేసి, ఇంట్లోని టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లిపై దాడి చేసి గాయపరిచిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.

దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – పాయల్ శంకర్

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వ్యక్తులపై దాడులకు పాల్పడటం, మహనీయుల చిత్రాలను అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ అన్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్టులు ఖండనీయం
దాడులకు గురైన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం, మద్దతు తెలిపేందుకు ఈరోజు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ రావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి తదితర నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పాయల్ శంకర్ అన్నారు.
“దాడులకు గురైన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమే. అసలు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులకు మద్దతుగా నిలిచేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదు” అని పాయల్ శంకర్ అన్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయానికి వెళ్లి, రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గారికి వినతిపత్రం అందించినట్లు పాయల్ శంకర్ తెలిపారు. 

నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై సుమారు 50 మంది దాడికి పాల్పడినట్లు, అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు, ఆయన తల్లిపై దాడి చేసి గాయపరిచినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిపారు. 

అదేవిధంగా సంత్ రవిదాస్ జీ చిత్రాన్ని అవమానించిన ఘటనపై కూడా ప్రత్యేక దర్యాప్తు జరిపి, దర్యాప్తులో నేరం నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
చట్టం ముందు అందరూ సమానమే. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు తగిన భద్రత కల్పించాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుంది” అని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.
Comments