ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షరతెలంగాణ
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివారులోని రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం మధ్యాహ్నం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 28 లక్షల నగదు బయటపడింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుండి నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుండి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద అధికారులు సోదా చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న సుభాష్ కేశవ్ అనే వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా, అందులో రూ. 28 లక్షల నగదు లభ్యమైంది.
సదరు నగదుకు సంబంధించి సుభాష్ కేశవ్ వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేకపోవడంతో, ఎన్నికల నియమావళి ప్రకారం ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు షిఫ్టుల వారీగా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును సరైన పత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తామని, ప్రజలు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ తనిఖీ లో డి ఎస్పీ జీవన్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్:
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
ఆదిలాబాద్‌లో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం
ఈనెల 6–8 తేదీల్లో అవకాశం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజార్షి షా
మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజార్షి షా బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
పోలింగ్ రోజున డ్యూటీ కారణంగా ఓటు వేయలేని సిబ్బంది ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయదలిచిన ఉద్యోగులు తమ వెంట ఎన్నికల డ్యూటీ ఆర్డర్, ఓటరు గుర్తింపు కార్డు (EPIC), ఫారం-12
తీసుకురావాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి సందేహాల నివృత్తి కోసం నోడల్ అధికారి ఎ. ఫణీందర్ రావు ఫోన్: 8106517561 ను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.
ఆదిలాబాద్
ఎన్నికల కోడ్ ఉల్లంఘన .CRP సేవల నిలిపివేత
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భీంపూర్ మండలం పిప్పల్‌కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (CRP)గా పనిచేస్తున్న పి. రవీందర్‌ను విధుల నుండి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ రాజేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మండల విద్యాశాఖాధికారి సమర్పించిన నివేదిక ప్రకారం, సదరు ఉద్యోగి ఒక రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందని, ఈ విషయంపై దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విచారణలో బయటపడ్డ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమగ్ర శిక్షాణ తెలంగాణ ఉపాధి ఒప్పంద నిబంధనల ప్రకారం సిబ్బంది రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణా ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే సదరు ఉద్యోగిని తక్షణమే విధుల నుండి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.
Comments