ADB: "ఆదిలాబాద్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం" రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
క్వింటాల్‌కు రూ.9,260 వరకు ధర..జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 కొనుగోలు కేంద్రాలు
తేమ శాతం విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు మెరుగైన ధర పొందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన పత్తి కొనుగోలు ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి తేమ శాతం పరీక్ష, తూకం ప్రక్రియను పరిశీలించి రైతులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,669 కాగా, జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతం రూ.9,260 వరకు ధర చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌లో అత్యధిక ధర లభించడం రైతులకు ప్రయోజనకరమైన విషయమన్నారు.
పత్తిలో తేమ శాతం అధికంగా ఉండకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావడం ద్వారా నాణ్యతను కాపాడుకోవడంతో పాటు మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో తేమ శాతం పరీక్షించే యంత్రాల వినియోగంపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని యంత్రాల ద్వారా పారదర్శకంగా పరీక్షించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.
రైతుల సౌకర్యార్థం మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు వేచి ఉండే సమయం తగ్గేలా తూకం, తేమ పరీక్ష, కొనుగోలు తదితర ప్రక్రియలను సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ‘రూపాయికే భోజనం’ పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతు ప్రతినిధులతో స్థానిక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంట వ్యర్థాలను కాల్చవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు దెబ్బతినడంతో పాటు భూసారం, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందన్నారు. పంట అవశేషాలను భూమిలోనే కలిపి సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పంట వ్యర్థాలను పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం ద్వారా పశువులకు మేత కొరతను నివారించవచ్చన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో పత్తికి క్వింటాల్‌కు రూ.9,260 వరకు ధర లభించడం రైతులకు శుభపరిణామమన్నారు. జమ్మికుంటలో రూ.9,250, వరంగల్‌లో రూ.9,110 ధరలు నమోదయ్యాయని తెలిపారు. పత్తి వాహనాలు రాంపూర్, బైపాస్ మార్గం మీదుగా మార్కెట్‌యార్డుకు చేరుకోవాలని, తూకం పూర్తయిన వెంటనే పట్టీ తీసుకోవాలని రైతులకు సూచించారు.
మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, పత్తికి రూ.9,260 వరకు ధర లభించడం రైతులకు సంతోషకరమైన విషయమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలను కాపాడుకోవాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతు సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments