కొమురం భీం ఆసిఫాబాద్ : అక్షర తెలంగాణ
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మహనీయుని ఆశయాల సాధనకు కృషి చేయాలి: మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దనసరి సీతక్క
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం పోరాడిన అమరుడు కొమురం భీం త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. కొమురం భీం 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, గిరిజనుల ఆరాధ్య దైవమైన అమరజీవి కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, తాగునీరు తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. రాబోయే బడ్జెట్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గిరిజనులకు సంబంధించిన జీఓల అమలుపై వచ్చిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సంబంధిత జీఓల అమలుకు పూర్తి స్థాయి అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేసే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడతామని అన్నారు. గిరిజనుల అటవీ సమస్యలను పరిష్కరిస్తూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన గిరిజనులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు అందుతున్న కాస్మెటిక్, డైట్ ఛార్జీలను పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని తెలిపారు.
సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులకు అందుతున్న సంక్షేమ ప్రయోజనాలు, అటవీశాఖ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీని పంపిస్తామని తెలిపారు. అక్కడ అమలవుతున్న మంచి విధానాలను పరిశీలించి, అవసరమైన వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీం: మంత్రి సీతక్క
మంత్రి దనసరి సీతక్క మాట్లాడుతూ, జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వీరుడు కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కొమురం భీం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ, బిర్సా ముండా వంటి మహనీయుల పోరాట స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులు మానవత్వంతో, అంకితభావంతో వ్యవహరించాలని సూచించారు. ఆదివాసీల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. యువత విద్యపై దృష్టి సారించి ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 8 వేల ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు లభించిందని, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు, తాగునీరు, విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.180 కోట్లతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్ మాట్లాడుతూ.. కొమురం భీం ఆదివాసీల ముద్దుబిడ్డ, జాతిరత్నమన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీఎఫ్డీ, జన్మన్, ఆర్టికల్ 275(1) తదితర కేంద్ర నిధులను గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కొమురం భీం తన ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు. గిరిజనుల అటవీ సమస్యలను పరిష్కరించడంతో పాటు మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కొమురం భీం ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్నగర్, ఖానాపూర్ శాసనసభ్యులు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్, వెడ్మా బోజ్జు పటేల్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన యోధుడు కొమురం భీం ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, రవాణా, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరీత మాట్లాడుతూ.. కొమురం భీం పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను పరిరక్షిస్తూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి నిరంతరం తాగునీరు అందించేందుకు కెరమెరి సమీపంలో రూ.60 కోట్లతో ఇంటెక్వెల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఎస్పీ నిఖితా పంత్ మాట్లాడుతూ.. కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లలను చదివించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గిరిజన ప్రజల అభివృద్ధికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గిరిజన గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే కొమురం భీంకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గోండి భాషలో ప్రసంగిస్తూ గిరిజన ప్రజలను ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో గుస్సాడీ, చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమంలో భాగంగా మంత్రులు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు.
అంతకుముందు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ లను మంత్రులు, అధికారులు సందర్శించారు.
కార్యక్రమంలో కొమురం భీం మనుమడు కొమురం సోనే రావు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జోయల్, ప్రజాప్రతినిధులు, గిరిజన ప్రజలు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments