ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
వారి త్యాగాల ఫలితమే నేటి ప్రశాంత వాతావరణం:
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం ఎస్పీ అఖిల్ మహాజన్
శాంతిభద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దుల రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, న్యాయమూర్తి హుస్సేన్ నాయక్, అదనపు ఎస్పీ పి. మౌనిక, ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తదితరులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో, దేశ రక్షణలో ప్రాణాలర్పించిన 154 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ పి. మౌనిక చదివి వినిపించారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించి, శోక్ శస్త్ర ద్వారా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని అన్నారు. పోలీసుల నిస్వార్థ సేవలకు ప్రజలు సహకరించాలని, నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ నిరంతరం స్మరించుకోవాలని అన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై చైనా సైనికులు దాడి చేయగా, ధైర్యంగా పోరాడిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది వీరమరణం పొందారని తెలిపారు. వారి స్మారకంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను పది రోజుల పాటు ప్రజాహిత కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత సమాజం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతోందని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. తెలంగాణ పోలీసు శాఖ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెండో బెటాలియన్ కమాండెంట్ బి. వెంకటేశ్వర రెడ్డి, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, పోలీసు అధికారులు, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, రెండో బెటాలియన్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments