ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
946 ఓట్ల భారీ మెజార్టీతో రాథోడ్ జైసింగ్ రికార్డ్ విజయం
ఆదిలాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఇద్దరు నేతల హవా
నియామక పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) ఆదిలాబాద్ జిల్లా బ్రాంచ్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే డాక్టర్ ఆడె క్రాంతి కుమార్, రాథోడ్ జైసింగ్ల హవా నడిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన డాక్టర్ ఆడె క్రాంతి కుమార్ ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు అసాధారణ ప్రజాదరణతో రాథోడ్ జైసింగ్ ఏకంగా 946 ఓట్ల భారీ మెజార్టీ సాధించి రికార్డ్ స్థాయి విజయాన్ని తన సొంతం చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి, జెడ్పీపీ సీఈఓ బి. రవి పర్యవేక్షణలో అక్టోబర్ 4న జెడ్పీపీ కాన్ఫరెన్స్ హాల్‌లో రహస్య ఓటింగ్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 15 మంది కమిటీ సభ్యుల స్థానాల కోసం 46 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఓటర్లు డాక్టర్ ఆడె క్రాంతి కుమార్, రాథోడ్ జైసింగ్‌ల నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు.
ఈ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు బండారి కృష్ణ, నెమ్మని రాజేశ్వర్ రావు, జొంపల్లి సంజీవ్ రావు, నాంపెల్లి సౌందర్య, భాగత్ సునీత కుమారి, సామ రూపేష్ రెడ్డి, చింతకుంట వెంకట నారాయణ రాజు, సామె రమేష్ రెడ్డి, మామిడిపల్లి మనోహర్, మాసం అనిల్, కుర్మే విశ్వనాథ్, పట్వార్ గజానన్, కొరడ్య పార్థసారథిలు కూడా మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం రాబోయే మూడేళ్ల పాటు జిల్లాలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తరించనుంది. చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ ఆడె క్రాంతి కుమార్, భారీ మెజార్టీ సాధించిన రాథోడ్ జైసింగ్‌లకు జిల్లాలోని పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
Comments