50 కోట్లతో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం -ఎమ్మెల్యే పాయల్ శంకర్

Madupa Santhosh CEO
 ADB: 50 కోట్లతో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం -ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
ఎమ్మెల్యే పాయల్ శంకర్  కృషికి ఫలితం ఆదిలాబాద్ ప్రజలకు మెరుగైన మాతా, శిశు వైద్య సేవలు
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం (Mother & Child Health – MCH Centre) ఏర్పాటుకు రూ.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ రిమ్స్‌పై ఆదిలాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన గిరిజన, గ్రామీణ, పేద కుటుంబాలు కూడా వైద్య సేవల కోసం ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువులకు ప్రత్యేక వైద్య సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మాతా శిశు వైద్య సేవలు సాధారణ ఆసుపత్రి భవనంలోనే కొనసాగుతుండటంతో పడకలు, వసతుల కొరత ఏర్పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో 08-06-2026న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి ప్రత్యేకంగా లేఖ రాసి, రిమ్స్ ఆదిలాబాద్‌లో ప్రత్యేక మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం G.O.Rt.No.411,  150 పడకల MCH కేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులు భవన నిర్మాణం మరియు అవసరమైన వైద్య పరికరాల కోసం కేటాయించబడ్డాయి. ఈ వ్యయం పునరావృతం కాని వ్యయంగా (Non-Recurring Expenditure) మంజూరు చేయబడింది.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పేద తల్లులు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం తన ప్రాధాన్యత అని, 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో తల్లులు, పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు మరింత మెరుగుపడతాయన పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, రిమ్స్‌ను మరింత బలోపేతం చేయడానికి తన ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని పాయల్ శంకర్ గారు తెలిపారు.
ఆదిలాబాద్ ప్రజల వైద్య అవసరాన్ని గుర్తించి రూ.50 కోట్ల నిధులతో MCH కేంద్రానికి అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వకి పాయల్ శంకర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments