ADB: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి వేడుకలు
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు గుస్సాడి దండారి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గురువారం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో నిర్వహించిన గుస్సాడి దండారి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరంద్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల విశిష్టమైన సంప్రదాయంలో భాగమైన గుస్సాడి దండారి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని భావితరాలకు అందిస్తున్న గిరిజనులను అభినందించారు.
ఐటీడీఏ పీవో మంద మకరంద్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు వారి సాంస్కృతిక వేడుకలకు ఐటీడీఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గుస్సాడి దండారి నృత్య సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఈ వారసత్వాన్ని భావితరాలకు అందించడం అందరి బాధ్యతని తెలిపారు. గిరిజన సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గుస్సాడి దండారి వేడుకలు ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఒక గ్రామానికి చెందిన దండారి బృందాలు మరో గ్రామానికి వెళ్లి వేడుకల్లో పాల్గొనడం గిరిజనుల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను పాటిస్తూ పండుగలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. రిమ్మ గ్రామం ఇప్పటికే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోందని, గ్రామస్థులంతా ఐక్యంగా గుస్సాడి దండారి ఉత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రుత్విక్, ఎంపీడీవో సంతోష్, గ్రామ పటేల్ శంకర్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు మహేందర్, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Comments