బాల్య వివాహాల రహిత గ్రామాల నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత- జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB : బాల్య వివాహాల రహిత గ్రామాల నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.. ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని బాల్య వివాహాల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలికల బాల్యాన్ని, విద్యను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. 
బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ బుక్తాపూర్, విద్యానగర్ మీదుగా జెడ్పీ హాల్ వరకు కొనసాగింది. విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. అనంతరం జెడ్పీ హాల్‌లో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, వారి చదువు, వ్యక్తిత్వ వికాసం, స్వతంత్ర నిర్ణయాధికారం దెబ్బతింటాయని తెలిపారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, కట్న ఖర్చుల భయం వంటి కారణాలతో కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలికల అభిప్రాయాలకు కుటుంబాల్లో ప్రాధాన్యతనిస్తూ, వారికి ఉన్నత విద్యను అభ్యసించే స్వేచ్ఛ, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
కౌమార దశ బాలికల సాధికారత కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘స్నేహ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా బాలికలతో స్నేహ గ్రూపులు ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల తరహాలో వారిని సంఘటితం చేస్తున్నామని వివరించారు. బాలికలను ఆర్థికంగా, మానసికంగా బలోపేతం చేయడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు.
ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా, జరిగే అవకాశం ఉందని సమాచారం అందినా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. అధికారులు తక్షణమే స్పందించి వివాహాలను అడ్డుకోవడంతో పాటు బాలికల విద్య కొనసాగేందుకు అవసరమైన సహకారం అందిస్తారని తెలిపారు. వయస్సు నిర్ధారణకు ఎస్‌ఎస్‌సీ మెమో లేదా గ్రామ పంచాయతీ జనన రిజిస్టర్ వివరాలను ప్రామాణికంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించే వారితో పాటు వాటికి సహకరించే ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, టెంట్ హౌస్ యజమానులు, క్యాటరర్లు, ఇతర సరఫరాదారులు, పూజారులు, పాస్టర్లు కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరగాలని, ప్రతి ఒక్కరూ చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలికలు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ సూచించారు. న్యాయవాదులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగేందుకు బాలికలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, కళలు తదితర రంగాల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. మధ్యలో చదువు మానేసిన బాలికలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన సామాజిక అంశమని అన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల బాలికల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోవడంతో పాటు ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాలికలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, వారు స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల రహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ గుర్తింపును నిలబెట్టుకుంటూ భవిష్యత్తులోనూ తమ గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని, తమ గ్రామాలను బాల్య వివాహాల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహ ముక్త్ భారత్‌కు సంబంధించిన గోడపత్రికలను (వాల్ పోస్టర్లను) కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, నీతి ఆయోగ్ సీఆర్ఏ దేవిశ్రీ, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు కె. వినోద్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీష్, సంక్షేమ శాఖ సిబ్బంది స్వామి, వినోద్, కిరణ్, శంకర్, ప్రసన్న, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments