ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర.
ఫోర్జరీ, చీటింగ్, బెదిరింపులకు పాల్పడిన నలుగురిపై కేసు నమోదు.
ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ శివారులో వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు నకిలీ రెవెన్యూ రికార్డులు సృష్టించి, ఫోర్జరీ, మోసం, బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మంతెన సుదర్శన్ ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం.. ఖానాపూర్ శివారులోని అంకోలి–తాంతోలి రహదారి సమీపంలో సర్వే నంబర్లు 68/44/2, 68/44/3లో తనకు, తన అన్నకు కలిపి మొత్తం 3 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు నిందితులు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2004–2005 సంవత్సరాల్లో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, తప్పుడు పహాణీలు సృష్టించి సుమారు ఎకరం 24 గుంటల భూమిని అక్రమంగా తమ పేరుపై పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధితులు రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ, నిందితులు నకిలీ పత్రాలను ఆధారంగా చేసుకుని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, గొడవలకు దిగడం, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 461/2026 కింద IPC సెక్షన్లు 447, 420, 467, 468, 471, 386, 120(B) r/w 34 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
నల్లగంటి నవీన్ కుమార్ తండ్రి నల్లగంటి ప్రసాద్, వృత్తి అడ్వకేట్, ఖానాపూర్, ఆదిలాబాద్. నల్లగంటి రాజమ్మ భర్త నల్లగంటి ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్.
నల్లగంటి ప్రసాద్, నల్లగంటి సాగర్, తండ్రి ప్రసాద్ .
ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం, ఇతరుల ఆస్తులను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు.
ఈ కేసులో ఎస్సై వి. విష్ణువర్ధన్ తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments