అదిలాబాద్ : అక్షరతెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ "భూ భారతి - ఆర్. ఓ. ఆర్" చట్టం పై అవగాహన సదస్సులో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారి ఆధ్వర్యంలో మావల లోని రైతువేడుకలో అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో "భూ భారతి - ఆర్. ఓ. ఆర్" చట్టం పై, పోర్టల్ పై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపిడివో, అగ్రికల్చర్ ఏవో,ఇతర మండల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి రైతుల సమస్యలను, భూ భారతిపై ఉన్న సందేహాలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాంత్ రెడ్డి వెంట పలువురు రైతులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు అట్ల గోవర్ధన్ రెడ్డి , రహీం ఖాన్ , నవీన్ రెడ్డి , నాగ రాజు ,భూపెల్లి శ్రీధర్ , ప్రభాకర్ , స్వామి, కుదురుపాక సురేష్ , రాజేంధర్ , గౌతం , అశోక్ ,లస్మన్న , దినేష్ , అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ధరణితో బాధపడ్డ రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చామని అన్నారు. రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను, సామాన్యులను కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పిందని, 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ఆ సమస్యలు ప్రస్తుత చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్‌లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. ఈ పోర్టల్‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు.
Comments