ఆపరేషన్ కగార్ ను ఖండిస్తున్నాం : ఆపివేయాలి: బీవీ రాఘవులు (సిపిఐ ఎం).

Madupa Santhosh CEO
HYD : ఆపరేషన్ క‌గార్‌ను ఖండిస్తున్నాం. ఆపివేయాలి: బీవీ రాఘవులు (సిపిఐ ఎం)
హైదరాబాద్ : అక్షరతెలంగాణ
మావోయిస్టుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాలి
ఆదివాసీల‌ను అడ‌వుల నుంచి వెళ్ల‌గొట్టి కార్పొరేట్ల‌కు ఖ‌నిజ సంప‌ద అప్ప‌గించే కుట్ర‌
ఆప‌రేష‌న్ క‌గార్‌ను ఆప‌డంపై కేంద్రంపై రాష్ట్ర స‌ర్కార్ ఒత్తిడి తేవాలి
కాళేశ్వ‌రంపై అఖిల‌ప‌క్షం వేసి చ‌ర్చించాలి 
వీడీసీ ఆగ‌డాల‌కు రాష్ట్ర స‌ర్కారు అడ్డుక‌ట్ట వేయాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ 
హైద‌రాబాద్ - ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో  కేంద్ర ప్ర‌భుత్వ బ‌ల‌గాలు  మావోయిస్టుల‌పై హ‌త్యా కాండ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌నీ, ఆ ఆప‌రేష‌న్‌ను వెంట‌నే ఆపాల‌ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స‌భ్యులు బీవీ.రాఘ‌వులు కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్ర‌తినిధుల‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని సూచించారు.  సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ఎంబీ భ‌వ‌న్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు జ్యోతితో క‌లిసి  ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీని అంతం చేయాల‌ని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో బ‌ల‌గాల‌ను మోహ‌రించి వారి తుడిచిపెట్టాల‌ని కేంద్రం ప్ర‌క‌టించింద‌నీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చివ‌రి మావోయిస్టును చంపేదాకా వ‌దిలిపెట్ట‌బోమ‌ని  మాట్లాడటం ప్ర‌జాస్వామిక దేశంలో అత్యంత అభ్యంత‌క‌ర విష‌యం అని తెలిపారు.    సైన్యం త‌మ సొంత ఆస్తిగా  ఆయ‌న మాట్లాడ‌టాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని మావోయిస్టు పార్టీ ప్ర‌తినిధులు అడుగుతుంటే వారిని గౌర‌వించి పిలువ‌కుండా తుదిముట్టించేదాకా వ‌ద‌ల‌బోమ‌న‌టం దుర్మార్గ‌మ‌న్నారు.  ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడ‌వుల్లో ఆదివాసీల‌ను నిర్మూలించే ప‌ద్ధ‌తిని మోడీ సర్కారు కొన‌సాగిస్తున్న‌ద‌న్నారు.  సాయుధ‌లైన మావోయిస్టుల‌కు, పోలీసు బ‌ల‌గాల‌కు మ‌ధ్య జ‌రుగున్న యుద్ధంలా అది లేద‌నీ,  బ‌ల‌గాలు అట‌వీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆదివాసీల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి వారిని అడ‌వుల నుంచి వెళ్ల‌గొట్టేలా ఉంద‌ని చెప్పారు.  అక్క‌డ‌ మాన‌వ‌, ఆదివాసీ, గిరిజ‌న హ‌క్కులను హ‌రణ జ‌రుగుతున్న‌ద‌ని వాపోయారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ అట‌వీ ప్రాంతంలోని విలువైన ఖ‌నిజ సంప‌ద‌ను స్వ‌దేశీ, విదేశీ కార్పొరేట్ల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర దాని వెనుక ఉన్న‌ద‌ని విమ‌ర్శించారు.  ఆప‌రేష‌న్ క‌గార్‌లో  తెలంగాణ‌లోని రెండు మండ‌లాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు.  భార‌త్ స‌మ్మిట్‌లో సామాజిక న్యాయం, ప్ర‌జాస్వామ్యం, ఆదివాసీ, గిరిజ‌న హ‌క్కుల‌పై కాంగ్రెస్ పార్టీ డిక్ల‌రేష‌న్‌లు చేస్తే స‌రిపోద‌నీ, ఆదివాసీల‌పై జ‌రుగుతున్న‌దాడిని ఆపేలా కేంద్రంపై ఒత్త‌డి తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్దిష్ట‌మైన హామీ ఇవ్వాల‌ని కోరారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై 370 పేజీల‌ ఎన్‌డీఎస్ ఏ నివేదిక తీవ్ర‌మైన లోపాల‌ను, ప‌లు కీల‌క అంశాల‌ను ఎత్తిచూపింద‌న్నారు.  మేడిగ‌డ్డ‌, అన్నారం,  సుందిళ్ల బ్యారేజీల నాసిర‌కం నిర్మాణం, డీపీఆర్ ఆమోదం ల‌భించ‌కుండానే ప‌నులు చేయ‌డం, మ‌ట్టి న‌మూనా టెస్టులు చేయ‌క‌పోవ‌డం, డిజైన్ల‌లో మార్పులు, త‌దిత‌ర లోపాల‌ను నివేదిక బ‌య‌ట‌పెట్టింద‌న్నారు.  ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెంట‌నే అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేసి అందులో దానిపై స‌మ‌గ్రంగా చ‌ర్చించాల‌ని కోరారు. ఆ మూడు బ్యారేజీలు ఎంత వ‌ర‌కు అక్క‌ర‌కువ‌స్తాయి? మ‌ర‌మ్మ‌తులు చేస్తే అక్క‌ర‌కు వ‌స్తాయా?  సాధ్యాసాధ్యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్నారు.                                                
                   జ‌నాభా ప్రాతిప‌దిక డీలిమిటేష‌న్ చేస్తే ద‌క్షిణాది రాష్ర్టాల‌తో పాటు  పంజాబ్, పలు రాష్ర్టాలు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌నీ, అందుకే ఆ ప్రాంతాల్లో దీనిపై వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ద‌న్నారు. జ‌నాభా నియంత్ర‌ణ‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టిన రాష్ర్టాల‌ను నేరం చేసిన‌ట్టుగా చూపి సీట్లు త‌గ్గించ‌డం త‌గ‌ద‌న్నారు.  అదే స‌మ‌యంలో జ‌నాభా విప‌రీతంగా పెరిగిన‌ బీజేపీ పాలిత  యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయ‌నీ, డీలిమిటేష‌న్ వెనుక బీజేపీ రాజ‌కీయ ల‌బ్ది ఉంద‌ని విమ‌ర్శించారు.  ఆయా రాష్ర్టాల్లో ఇప్పుడున్న ఎంపీ సీట్ల‌ నిష్ప‌త్తి ప్ర‌కారం సీట్లు పెంచాల‌న్నారు.                                                                                                          
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వెనుక‌బ‌డిన సామాజిక త‌ర‌గ‌తుల వారిని సామాజిక అణ‌చివేత‌ల‌కు, సాంఘిక బ‌హిష్క‌ర‌ణ‌కు గురిచేస్తున్న వీడీసీల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. తాళ్ల‌రాంపూర్‌లో రూ.5 ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో గీత‌కార్మికులను వీడీసీ గ్రామ బ‌హిష్కర‌ణ చేయ‌డం, దేవాల‌యంలోకి రాకుండా అడ్డుకోవ‌డం క్ష‌మించ‌రాని నేర‌మ‌న్నారు. వీడీసీ ముసుగులో తాటివ‌నాన్ని త‌గుల‌బెట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, పెత్తందారుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.  డీఎస్పీ, రెవెన్యూ అధికారులు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై త‌ప్పుబ‌ట్టారు. మంచిర్యాల జిల్లాలో క‌న్న‌య్య అనే ఆదివాసీతోని చిన్న‌న్న‌రెడ్డి అనే వ్య‌క్తి పాలేరు ప‌నిచేయించుకుని జీతం ఇవ్వ‌క‌పోగా...అత‌ని ఎక‌రా భూమి అక్ర‌మంగా రిజిస్ర్టేష‌న్ చేయించుకోవ‌డం అన్యాయ‌మ‌న్నారు.  దీంతో ఆ పెత్తందారీ ఇంటి ముందే పురుగుల మందు తాగి క‌న్న‌య్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలిపారు.  ఘ‌ట‌న జ‌రిగి 15 రోజులు అవుతున్నా పోలీసులు ఎస్‌సీ, ఎస్టీ చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డాన్నీ, పెత్తందారుడిని కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఈ కేసుతో స‌బంధం ఉన్న ముగ్గురిపైన కేసు న‌మోదు చేయాలని డిమాండ్ చేశారు.  ఎక‌రా భూమిని తిరిగి క‌న్న‌య్య భార్య పేరిట రిజిస్ర్టేష‌న్ చేయించాల‌నీ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరారు.  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప‌రిధిలో 700 మంది పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇండ్ల ప‌ట్టాలిచ్చింద‌నీ, వాటిలోకి పేద‌లు వెళ్ల‌కుండా ఆర్ ఎఫ్ సీ యాజ‌మాన్యం అడ్డుకోవ‌డం స‌రిగాద‌ని తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని పేద‌ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఫార్మాసిటీ ప్రాంతంలో రైతుల నుంచి భూముల‌ను లాక్కోవ‌డాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోంద‌న్నారు.  మే ఒక‌టో తేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు  మేడే ఉత్స‌వాల‌ను ఊరూరా చేయాల‌ని ఆ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.
Comments