మహిళా సంఘాలకు రూ. 4.25 కోట్ల వడ్డీ లేని రుణాలు: జిల్లా కలెక్టర్. రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB :  1049 మహిళా సంఘాలకు రూ. 4.25 కోట్ల వడ్డీ లేని రుణాలు: జిల్లా కలెక్టర్. రాజర్షి షా 

ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ 
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ. 4,25,70,880/- విలువైన వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులు డీబీటీ  పద్దతి ద్వారా నేరుగా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. మహిళలు కట్టిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ తిరిగి చెల్లిస్తోందని తెలిపారు. ఈ డబ్బును కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం లేదా వ్యాపార విస్తరణకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పట్టణంలో సుమారు 11,000 మంది మహిళలకు (దాదాపు 30% కుటుంబాలకు) దీని ద్వారా లబ్ధి చేకూరుతోందని అన్నారు. మహిళలు ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, విజయ డెయిరీ పార్లర్లు, స్కూల్ యూనిఫామ్ కుట్టు పని, పెట్రోల్ బంకుల నిర్వహణలో రాణిస్తున్నారని, అలాగే ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

అనంతరం  మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 1049 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 4 కోట్ల 25 లక్షల 70 వేల 880 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును కలెక్టర్, అదనపు కలెక్టర్, గ్రంథాలయ చైర్మన్ అందజేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజు, డి.ఎం.సి మెప్మా శ్రీనివాస్, టి.ఎం.సి మెప్మా భాగ్యలక్ష్మి, సిబ్బంది, ఆర్.పి.లు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా

వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క.

    మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
    సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అర్హులైన సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని తెలిపారు. మహిళా సంఘాలలో సభ్యులు కాని అర్హులైన వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి రద్దీ ఏర్పడకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
    జిల్లా కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
       ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఆర్డివో రవీందర్, మున్సిపల్ కమిషనర్ రాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments