ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో వడ్డెర జాతిపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మొదలైన సంఘర్షణను సాయుధ పోరాటంగా మలిచిన కీలక పాత్ర ఓబన్నదేనని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేపట్టిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షునిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇలాంటి వీరయోధుల జయంతులను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని, వారి పోరాట గాథలను నేటి తరాలకు పరిచయం చేయడంలో ఇవి కీలకమని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజలింగు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments