ఆదిలాబాదు: అక్షర తెలంగాణ
మాతా శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు
ముందుగా ప్రసూతి వైద్య సేవలు, టీఫా స్కానింగ్, 108 వాహన సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, ఈ సంవత్సరంలో మత శిశు మరణాలను పూర్తిగా నివారించి,సంకల్ప్' ప్రాజెక్ట్ ద్వారా 2027 నాటికి నవజాత శిశువుల మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాతా శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పనిచెయ్యాలని ఆదేశించారు. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ఆసుపత్రిలో చేరినప్పటి నుండి, డెలివరీ చేసే ముందు, ప్రసవ సమయంల, ప్రసవం జరిగిన తర్వాత కూడా నిరంతర వైద్య పర్యవేక్షణ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. కార్డియాలజీ, రేడియాలజీ, గైనకాలజీ విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి టిఫా, OBG స్కానింగ్ లు అత్యంత కీలకమని, దీనిపై రేడియాలజీ విభాగం అప్రమత్తంగా ఉండాలని, డీఎంహెచ్‌ఓ, రేడియాలజీ విభాగాలు పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ANC కేసులు, హాజరు, ఇతర సమస్యలను పరిష్కారానికి హెచ్‌ఓడీలు, డ్యూటీ డాక్టర్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో 108 వాహన సేవలు సకాలంలో అందేలా చేసుకోవాలని సూచించారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ, రోగులకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి సాధన, వైద్యులు అనంత రావు, దీపక్, రేడియాలజీ విభాగాధిపతి కళ్యాణ్ రెడ్డి, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments