నాగోబా జాతర ను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
 ADB : నాగోబా జాతరను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ:
     ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనవరి 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
మంగళవారం కేస్లాపూర్ దర్బార్ హాల్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జులతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరను సాంప్రదాయబద్ధంగా, పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి మహాపూజతో జాతర ప్రారంభమవుతుందని, 22వ తేదీన దర్బార్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు శాఖల వారీగా చేపట్టిన పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర ప్రాంగణంలో ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేయాలని, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్యం, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ నిరంతరం చేపట్టాలని సూచించారు. వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు.
వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, 104, 108 అంబులెన్సులు, మొబైల్ బైక్‌లు అందుబాటులో ఉంచి భక్తులకు తక్షణ వైద్య సేవలు అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగాలని, అవసరమైన మేరకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సూచించారు. దర్శనానికి పురుషులు, మహిళలకు వేరువేరుగా ప్రవేశం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24/7 పటిష్ట బందోబస్తు కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మర్రిచెట్టు ప్రాంతం, గోవాడ, దేవాలయ ప్రాంగణ సమీపంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, గిరిజన సాంప్రదాయ పూజలకు అవసరమైన పూజా సామగ్రి, విద్యుద్దీకరణ తదితర ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
     ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 350 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో 24/7 బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు.
    ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్రాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, భోజన వసతి వంటి మౌలిక సదుపాయాలు భక్తులు, ప్రముఖులు, అధికారులకు కల్పిస్తామని తెలిపారు.
    ఖానాపూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్, పార్కింగ్, మరుగుదొడ్లు, క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. జాతరలో నకిలీ ఆహార పదార్థాల విక్రయాన్ని అరికట్టేందుకు తనిఖీలు చేపట్టాలని, వైద్య, పోలీస్, అగ్నిమాపక, మద్యం నియంత్రణ శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
    అనంతరం నాగోబా జాతర చరిత్ర వివరాలతో రూపొందించిన ‘నాగోబా జాతర–2026’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
   ఈ సమావేశంలో ఎఎస్పీ కాజల్ సింగ్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ ఈఓ రవి, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments