ADB : ఆదివాసీ బిడ్డలకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్ : అక్షరతెలంగాణ
పేదల సొంతింటి కలను సాకారం చేయడం, ఆదివాసీలకు సమగ్రాభివృద్ధి కల్పించడంతో పాటు వారి పిల్లలకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకొని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
బుధవారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ తేజవత్‌లతో కలిసి ఉట్నూర్ మండలంలోని కుమ్మరి తండా, దంతన్‌పల్లి, పులిమడుగు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాలపై సమగ్రంగా వివరించారు. ప్రజల సంక్షేమo కోసం నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,21,874 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు. 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజన మహిళలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ (ROFR) భూ హక్కు పట్టాలను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. చిక్మాన్, పులిమడుగు త్రివేణి సంగమం ప్రాజెక్టులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం గిరిజన దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ క్యాలెండర్‌తో పాటు ‘జ్ఞాన ధార’ మ్యాగజిన్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ ఎమ్మెల్యే అనిల్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా:
కోలాంగూడలో కొమురం సూరు విగ్రహానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళి
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం, గిరిజనుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు కొమురం సూరు త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఉట్నూర్ మండలం కోలంగూడ గ్రామంలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కొమురం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో అణచివేతకు వ్యతిరేకంగా కొమరం సూరు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
గిరిజనుల హక్కుల కోసం కొమురం సూరు సాగించిన పోరాటం ప్రతి తరానికి మార్గదర్శకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ROFR (అటవీ భూమి హక్కుల) పట్టాల సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తామని, అర్హులైన ప్రతి ఆదివాసీకి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జల గిరి వికాసం పథకం ద్వారా గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు. గిరిజనులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, ఆధునిక సాగు పద్ధతులు, అధిక ఆదాయం ఇచ్చే పంటలను అవలంబించి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పి ఓ యువరాజ్ మర్మాట్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్:
నాగోబాను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క:గిరిజన సంస్కృతిని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం సాయత్రం దర్శించుకున్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి మెస్రం వంశీయులు, ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ గర్భాలయంలో నాగోబాకు అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాగోబా జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని, ఈ పురాతన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గిరిజన బిడ్డల అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి ని, మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులను మెస్రం వంశీయులు శాలువాలతో సన్మానించి, నాగోబ చిత్రపటాలను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, మెస్రం వంశీయులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments