అదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని నాగోబ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి గారికి పూజారులు, మెస్రం వంశీయులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో నాగోబ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని మంత్రి ప్రార్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి, ఆదివాసీల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన కేస్లాపూర్ నాగోబ క్షేత్రం విశిష్టత అపూర్వమని పేర్కొన్నారు. నాగోబ జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వారికి అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments