NRML: ముఖ్యమంత్రి బహిరంగ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి:
నిర్మల్: అక్షరతెలంగాణ
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి (జిల్లా ఇన్‌చార్జి మంత్రి) జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జిల్లాపర్యటన నేపథ్యంలో బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అంతకుముందు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పట్టణానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అటవీ శాఖ అతిథి గృహంలో పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మంత్రికి, ప్రభుత్వ సలహాదారుకు గౌరవ వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్:
సదర్మాట్ బ్యారేజీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా ప్రజల దశాబ్దాల కల, ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలిసి బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. బ్యారేజీ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజీతో ఈ ప్రాంత రైతాంగ కల సాకారం కాబోతోంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో, అత్యంత అట్టహాసంగా నిర్వహించాలి. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యవసాయ రంగానికి ఈ బ్యారేజీ వెన్నెముకగా నిలుస్తుందని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments