యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Madupa Santhosh CEO
ADB : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఆదిలాబాదు : అక్షరతెలంగాణ 
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాదు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణ పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
     ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీలో ముందువరుసలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. జిల్లాల వారీగా స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై తరచూ సమీక్షలు చేపట్టి, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
   అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇవ్వాలని, తగినంత సిబ్బంది, సామగ్రి అందుబాటులో ఉన్నాయా లేదో పరిశీలించాలని తెలిపారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోటో ఎలక్టోరల్ జాబితాలు, డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు.
     ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఆదిలాబాదు, బోథ్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి భూ సేకరణ సమస్యలు లేవని, ఇప్పటికే సంబంధిత శాఖలకు భూములు అప్పగించామని తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. టీజీడబ్ల్యూఈఐడీసీ ఇంజనీర్లతో సమన్వయం చేస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
       అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. టెండర్ దశలో ఉన్న పనులకు సంబంధించిన అగ్రిమెంట్లను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి వారం ఆన్‌లైన్ మానిటరింగ్, ప్రతి నెల క్షేత్ర స్థాయి పరిశీలన చేపడతామని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
    ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments