ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ
' ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో
అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు లకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆదేశించారు. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సీఎంఆర్ వ్యవహారంలో మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ, కేసుల పురోగతి, వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సాంకేతికతను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10-15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. కొంతమంది అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని, వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారని, దీంతో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. దీంతో బాధితులకు సకాలంలో సాంత్వన లభించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలతో పాటు కుల, నివాస, ఇతర అర్జీలను సకాలంలో ఆన్ లైన్ లో అందేలా చూడాలని చెప్పారు.
బాసర సరస్వతీ ఆలయంలో అన్ని సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తేవాలని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేసి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెంచాలని అన్నారు.
జిల్లాలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, రోడ్ల భద్రత, సురక్షిత ప్రయాణానికి చర్యలు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా పర్యవేక్షణ, పిల్లల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, విద్య, యువత–క్రీడల అభివృద్ధి, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమాలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమన్వయంతో అమలు చేసి ప్రజలకు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు.
అనంతరం పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్ ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు.
అనంతరం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ధ్రువపత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
అలాగే ఆఖరి సఫర్ వాహనాన్ని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.
సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాదు, బోథ్, ఖానాపూర్ శాసన సభ్యులు పాయల శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు.
Comments