ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్ అక్షర తెలంగాణ
ఒక కెమెరా 100 మంది సిబ్బందితో సమానం.
ప్రతి గ్రామం ఆదర్శంగా మరాలి.
తలమడుగు మండలం కజ్జర్ల గ్రామం లో 21 సీసీటీవీ కెమెరాకు ప్రారంభం.
గంజాయికి దూరంగా, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పాటించిన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయి.
నేరాలు జరగకుండా, జరిగిన నేరాలు తెలుసుకోవడానికి సిసిటీవీ కెమెరాల తోడ్పాటు.
ప్రతి గ్రామంలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపు.
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు. ఆధునిక కాలంలో నేరాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థకు తోడ్పడే విధంగా ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
“ఒక సీసీటీవీ కెమెరా 100 మంది సిబ్బందితో సమానం” అని పేర్కొంటూ, గ్రామ స్థాయిలో నిఘా వ్యవస్థను బలపరిచే దిశగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కీలకమని వివరించారు. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామం నందు ఏర్పాటు చేసిన 21 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. మొదటగా గ్రామ ప్రజలు పెద్దలు జిల్లా ఎస్పీకి డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, చిన్నచిన్న నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలను సమర్థవంతంగా నియంత్రించడానికి సీసీటీవీలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా మహిళల భద్రత, రాత్రి వేళల్లో కదలికల పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు వంటి అంశాల్లో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సీసీటీవీ కెమెరాల వల్ల నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించడమే కాకుండా, జరిగిన ఘటనలపై స్పష్టమైన ఆధారాలు లభించడం వల్ల విచారణ వేగవంతం అవుతుందని, నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని వివరించారు. ప్రతి గ్రామం గంజాయి రహితంగా ఉండటం, రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి నాలుగు ముఖ్య అంశాలను పాటిస్తే ఆ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని, ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన పెంచుకోవాలని కోరారు.
అదే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆదర్శ యువ రైతులకు సత్కరించి బహుమతి ప్రధానం చేసి సన్మానించారు. కజ్జర్ల గ్రామ రామాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె ఫణిదర్, తలమడుగు ఎస్ఐ డి రాధిక, సర్పంచ్ ఎల్మా నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, గ్రామ పెద్ద చితలపెల్లి దేవరెడ్డి, అగ్రికల్చర్ ఏడి నర్సయ్య, నాయకులు అగ్గిమల్ల గణేష్, వర్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
దారిదోపిడి, హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్
లిఫ్ట్ పేరుతో బాధితున్ని బండరాయితో కొట్టి, కత్తితో గాయపరిచిన నిందితుడు.
బాధితుని వద్దనుండి నేరానికి వినియోగించిన కత్తి, 1300 నగదు, ఒక కీప్యాడ్ ఫోను దోపిడీ.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసును చేదించిన రూరల్ సర్కిల్ పోలీసులు.
వెహికల్ చెకింగ్ జరుగుతుండగా పట్టుబడ్డ నిందితుడు.
నిందితుని వద్ద నుండి నిందితుడి ప్యాషన్ ప్లస్ వాహనం, నిందితుని మొబైల్ ఫోన్, బాధితుని మొబైల్ ఫోన్, రూ 1000 నగదు స్వాధీనం
ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఫణిదర్
మంగళవారం జరిగిన దాడి దోపిడీ మరియు హత్యాయత్నం కేసును ఛేదించి, ఆదిలాబాద్ రూరల్ సీఐ కే ఫణిదర్ వివరాలను వెల్లడించారు,
మంగళవారం 17వ తారీఖున రాత్రి 8:30 గంటల సమయంలో బాధితుడు జుంగారే అశోక్ (40) s/o గంగన్న, లండసాంగ్వి గ్రామానికి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ పట్టణం నుండి యాపలగూడ నందు గల తన అక్క భూమిక ఇంటికి వెళ్లే క్రమంలో వినాయక్ చౌక్ నందు గల పెట్రోల్ బంక్ వద్ద వాహనాల కోసం వేచి చూడగా, నిందితుడు దండుగుల వెంకటేష్ తనకు లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి, అమాయకుడైన అతనిని ఎలాగైనా మోసం చేసి డబ్బు దోచేయాలని దురుద్దేశంతో, అతనిని ఎక్కించుకొని బంగారిగూడ అనుకుంటా గ్రామాలకు మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్ద కాలకృత్యాలకు వెళ్తానని చెప్పి అతనిని ఒక పెద్ద బండరాయితో తలపై గాయపరిచి, నిందితుడు ముందుగానే అనుకున్నట్టుగా తన వద్ద ఉన్న కత్తితో మెడపై, చేతిపై గాయాలకు పాల్పడినాడు.
ఈ క్రమంలో నిందితుడు, బాధితుడు వద్ద నుండి 1300 రూపాయల నగదు అతని వద్ద గల జియో కీప్యాడ్ మొబైల్ ఫోన్ను దోపిడీ చేసి వెళ్లిపోయాడు.
బాధితుడు తేరుకొని యాపాలగూడ నందు గల తన అక్క దగ్గరకు చేరుకున్నారు. వెంటనే తన అక్క సహాయంతో రిమ్స్ ఆసుపత్రి నందు చేరుకొని, జిల్లా పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించగా, రూరల్ పోలీస్ స్టేషన్ నందు నిందితునిపై దారి దోపిడీ మరియు హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రూరల్ సీఐ కె ఫనిధర్ దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకోవాలని సిసిటీవీ కెమెరాలను అన్వేషించగా అతనిని గుర్తించడం జరిగిందని, ఈరోజు అనుకుంటా గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోతున్న క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు.
నిందితుడి వద్ద నుండి దోపిడీకి యత్నించిన ఫ్యాషన్ ప్లస్ వాహనాన్ని, నిందితుడు వాడిన మొబైల్ ఫోన్ ను,నేరానికి వినియోగించిన కత్తి, బాధితుడి వద్ద నుండి దోచుకున్న డబ్బులలో మిగిలిన వెయ్యి రూపాయల నగదును, బాధితుని కీప్యాడ్ మొబైల్ ఫోన్ను, బాధితునిపై గాయం చేసినప్పుడు రక్తస్రావమైన దుస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
నేరం చేసిన ఎంతటి వారైనా తప్పించుకోలేనని పోలీసులు పట్టుకుంటారు అనే విషయాన్ని గుర్తించి నేరాలను చేయడం మానేయాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని, జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతో ఉంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసును చేదించడంలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకంగా వ్యవహరించిందని, ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని తమ ఇళ్ళనందు, వ్యాపార సముదాయాల నందు, తమ వీధులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments