ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: (అక్షర తెలంగాణ)
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వేదిక పిప్పిరిలో ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహణ
ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు
దిశ, నిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న 99 రోజుల 'ప్రజాపాలన' ఉత్సవాలలో భాగంగా మరియు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న
నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర ఉన్నత అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించి, అధికారులకు దిశ, నిర్దేశం చేశారు.
"ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం తాను చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అందుకే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, పాదయాత్ర సమయంలో కొన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన వివరించారు. " రాష్ట్రంలో '99 రోజుల ప్రజాపాలన ఉత్సవాలు' ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రామసభల నిర్వహణతో పాటు, ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభను పిప్పిరిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. "అని తెలిపారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను, గత బిఆర్ఎస్ ప్రభుత్వం 'ధరణి' పోర్టల్ ద్వారా ప్రొహిబిషన్ (నిషేధిత) జాబితాలో చేర్చిందని, దీనివల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాటి సీఎల్పీ (CLP) నేతగా తాను కలిసి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను వేధిస్తున్న ధరణిని రద్దు చేసి, పారదర్శకమైన వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ మాట ప్రకారమే అధికారంలోకి రాగానే 'భూభారతి' చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములను 'పార్ట్-బి'లో పెట్టి రైతులకు హక్కులు లేకుండా చేసిందని, కానీ తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వారి హక్కులను కాపాడుతుందని స్పష్టం చేస్తూ, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
2004లో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఆడ వద్ద కొమరం భీమ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటికీ, గత పది ఏళ్లుగా కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, కుడి మరియు ఎడమ కాలువలను వెంటనే పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే చికుమాను, పులిమడుగు, కుప్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై వివరాలు ఆరా తీశారు.
గిరిజనుల అభ్యున్నతి కోసం 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకం ద్వారా సాగును ప్రోత్సహించాలని సూచించారు. గిరిజన మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
గతంలో పాదయాత్ర సందర్భంగా కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయాన్ని సందర్శించినప్పుడు, మెస్రం వంశీయులు తమ సమస్యలను వివరించి ఆలయ అభివృద్ధిని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. అదే విధంగా, ఈ ఏడాది జూన్ 2 నుండి ప్రారంభించబోయే నూతన పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అయితే పాదయాత్రలో చాలామంది పేదలు ఇళ్ల కోసం విన్నవించుకున్నారని గుర్తు చేశారు. ఏజెన్సీ మరియు గిరిజన ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినా వాటిని స్వీకరించాలని, అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రజా పాలన 99 రోజుల ఉత్సవాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆనాటి సీఎల్పీ నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిప్పిరి గ్రామం నుంచి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 6న నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హాజరవుతున్న బహిరంగ సభకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టబద్ధంగా ఉన్న వాటిని పరిష్కరించాలని, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి మంజూరు పత్రాలను అందించే విధంగా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వెడమ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితారాణా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కలెక్టర్ హరిత, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments