ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు.
బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అభివృద్ధిపై తన ప్రభుత్వ ఉక్కు సంకల్పాన్ని చాటారు. కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి ఉన్న ఈ నేలను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలలో విప్లవాత్మక మార్పులు
గత ప్రభుత్వాలు చేయని పలు వినూత్న నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం వెల్లడించారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనిపై ఇప్పటివరకు సుమారు 10 వేల కోట్లు వ్యయం చేశామని తెలిపారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా బస్సుల యజమానులుగా మారుస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో 5,400 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 3.17 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌ను అభివృద్ధి హబ్‌గా తీర్చిదిద్దుతా
జిల్లా అభివృద్ధి దిశగా పలు కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని తెలిపారు. వీలైతే జూన్ 2న శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
జిల్లాలో యూనివర్సిటీ స్థాపనకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని, భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని వెల్లడించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పునఃప్రారంభించి, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యం
బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి 225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజల సేవే ధ్యేయం.
తాము పాలకులం కాదని, ప్రజల సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రెండు నెలలకోసారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షిస్తానని భరోసా ఇచ్చారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. ఈ సభ తన ఆలోచన కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించామని స్పష్టం చేశారు. రూ.1,238 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని, ప్రజల ఆలోచనలే ప్రభుత్వ విధానాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల చేతనే పాలన జరగాలని, ఫ్యూడల్ విధానాలకు తావులేదని స్పష్టం చేశారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే నిజమైన ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. ఆ దిశగా పిప్రి నుంచి ఖమ్మం వరకు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సభ రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజలతో ఏర్పడిన అనుబంధానికి ప్రతీక అని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే 99 శాతం హామీలు అమలు చేసిన ఘనత సాధించిందని తెలిపారు. పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.22,500 కోట్ల వ్యయంతో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు జమ చేశామని తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలు 300 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు.
విద్యా రంగంలో భాగంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణం చేపట్టామని, ఒక్కో పాఠశాలను రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి బిడ్డ ఆకలితో బడికి వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, నిరుద్యోగ యువత కోసం ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం చేపట్టామని వివరించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 30,149 స్వయం సహాయక సంఘాలకు (SHG) రూ. 53 కోట్ల 50 లక్షల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. ఎంపిక చేసిన ఐదుగురు లబ్ధిదారులకు (కిష్టయ్య, రాధ, భాగ్య, పద్మ, సుబ్బ) ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఉత్తమ పాలన కనబరిచిన 5 గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ (ISO) సర్టిఫికేషన్లను అందజేశారు. సీఎం కప్ స్టేట్ ఛాంపియన్‌షిప్ ఆదిలాబాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐ టి డి ఏ పి ఓ యువరాజ్ మర్మట్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, శాసన సభ్యులు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, సిబ్బంది, తదితరులు.
Comments