ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షకు విశేష స్పందన (ఉచిత కోచింగ్): జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : ఎస్సై, కానిస్టేబుల్  అర్హత పరీక్షకు (ఉచిత కోచింగ్) విశేష స్పందన : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ 

3,500 మంది అభ్యర్థులు హాజరు.
300 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత కోచింగ్‌కు సంబంధించి ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నలంద కళాశాల శ్రీ చైతన్య మరియు చావర పాఠశాలల పరీక్ష కేంద్రాల్లో 3446 మంది అభ్యర్థులు అర్హత పరీక్షకు హాజరయ్యారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్హత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు మరియు జిల్లాకు చెందిన ఆదివాసీలను ఎంపిక చేసి దాదాపు 300 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించి, వారికి పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థుల రాకపోకలు, పరీక్ష కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న నలంద కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, అకాడమీ సిబ్బంది, శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది తదితరులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం. వెంకట నరసయ్య, సీఐలు బీడీ ప్రేమ్ కుమార్, రహీం పాషా, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఆదిలాబాద్ : (అక్షర తెలంగాణ )
మావల పోలీస్ స్టేషన్


ADB : రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై కేసు, అరెస్ట్ఎస్ హెచ్ ఓ బి.డి. ప్రేమ్ కుమార్
ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి రూ.3.70 లక్షలు వసూలు.. మరో రూ.2 లక్షలు డిమాండ్

రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినాడు

దరాడే కేశవ్ తండ్రి దరాడే లక్ష్మణ్, ఇంటి నం. 6-186, రామ్‌నగర్, ఆదిలాబాద్ 
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి నట్లు మావల ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.

ఫిర్యాదుదారు జాధవ్ నౌసీలాల్ తన తండ్రి 2018లో పొందిన రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో ఆదిలాబాద్ పట్టణంలో ప్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. ఈ క్రమంలో గ్రామానికి పరిచయస్తుడైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ *దరాడే కేశవ్* ను సంప్రదించగా, SRR టౌన్‌షిప్‌లోని సర్వే నంబర్ 90లో ప్లాట్ నంబర్ 27 తనదేనని, దానిని విక్రయిస్తానని నమ్మించాడు.

ప్లాట్ ధర రూ.7.70 లక్షలుగా నిర్ణయించగా, 30-01-2020న రూ.3 లక్షలను చెక్కు ద్వారా, 26-04-2020న మరో రూ.70 వేల నగదును ఫిర్యాదుదారు చెల్లించారు. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం పలుమార్లు కోరినప్పటికీ కేశవ్ వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేశాడు.

2023 జనవరిలో మరోసారి రిజిస్ట్రేషన్ విషయమై సంప్రదించగా, ప్లాట్ ధర పెరిగిందని, అదనంగా రూ.2 లక్షలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడంతో 23-01-2023న ఆ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని తెలిపారు.
అదే ప్లాట్‌ను ఇతరులకు కూడా చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు, అలాగే ప్లాట్‌కు సంబంధించి LRS ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తమకు వెల్లడించకుండా తప్పుడు హామీలతో డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఫిర్యాదు మేరకు దరాడే కేశవ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల ఇన్‌స్పెక్టర్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో సంబంధిత పత్రాలు, యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ వివరాలు, LRS తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం మాత్రమే లావాదేవీలు చేయాలని సూచించారు.


ఆదిలాబాద్ : (అక్షర తెలంగాణ)

 ADB:  పిడిఎస్ బియ్యం అక్రమ తరలింపు.. నిందితుడు అరెస్ట్ : సీఐ రహీం పాషా
300 కిలోల పిడిఎస్ బియ్యం, మహీంద్రా మ్యాక్స్ వాహనం స్వాధీనం

నిందితుడిని అరెస్ట్ చేసి, జైలు కు రిమాండ్‌ తరలింపు
తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 300 కిలోల పిడిఎస్  బియ్యంతో పాటు మహీంద్రా మ్యాక్స్ ఫెస్టారా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు.
ఆగస్టు 22న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తలమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక పోలీస్ సిబ్బందితో కలిసి సుంకిడి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వస్తున్న TS-01-EF-6902 నంబర్ గల మహీంద్రా మ్యాక్స్ ఫెస్టారా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, 8 ప్లాస్టిక్ సంచుల్లో 300 కిలోల పిడిఎస్ బియ్యం గుర్తించారు.
 ఇమ్రాన్ ఖాన్ తండ్రి పాషా ఖాన్, వృత్తి: డ్రైవర్, పతోడా గ్రామం, మండ్వి పోస్టు, కిన్వట్ తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర.
 ఆదిలాబాద్‌లో తక్కువ ధరకు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై క్రైం నంబర్ 181/2026, BNS 318(4), 316(5) మరియు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌ చేసి జైలుకు  తరలించినట్లు సీఐ రహీం పాషా తెలిపారు.
పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments