ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
పేదల సొంతింటి కల సాకారం:
పొన్నారిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత గూడు కల్పించి, వారి జీవితాల్లో భరోసా నింపడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆదివారం తాంసి మండలం పొన్నారి గ్రామంలో లబ్ధిదారులు లక్ష్మి–రామన్న దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా లబ్ధిదారురాలు లక్ష్మి కలెక్టరేట్‌కు వెళ్లి తమ ఇంటి గృహప్రవేశానికి రావాలని స్వయంగా అందించిన ఆహ్వానాన్ని మన్నించి కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు.
దంపతులతో కలిసి నూతన గృహంలోకి ప్రవేశించిన కలెక్టర్, వారికి శాలువా కప్పి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 400 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిని, నిర్మాణ నాణ్యత, గదులు, మౌలిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతీకగా నిలుస్తోందన్నారు. గృహ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించి, లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
లక్ష్మి కుటుంబానికి ఇప్పటికే మూడు విడతల బిల్లులు జమయ్యాయని, ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో చివరి విడత బిల్లును త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు నిధులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలెక్టర్ ముచ్చటించారు. పిల్లల చదువులు, కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడంపై లబ్ధిదారులు లక్ష్మి–రామన్న దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వానికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నారాయణ, స్థానిక సర్పంచ్ తలారి భూమన్న, ఉపసర్పంచ్ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ జాదవ్ గణేష్, ఎంపీడీవో గడ్డం మోహన్‌రెడ్డి, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments