ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
పోలీసుల తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్ వ్యవహారం వెలుగులోకి.
వాహనం సీజ్.. నిందితుడిపై కేసు నమోదు
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో నకిలీ నంబర్ ప్లేట్‌తో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కధనం ప్రకారం.. కోలీపురాకు చెందిన తోట రాజేంద్ర ప్రసాద్ తండ్రి రామ్ కిష్టు తన ఆక్టివా ద్విచక్రవాహనంపై వినాయక్ చౌక్ వైపు వెళ్తుండగా పోలీసులు వాహన తనిఖీ కోసం ఆపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాహనం నంబర్ TS01AE1611ను ఆన్‌లైన్‌లో పరిశీలించగా, ఆ నంబర్‌కు సంబంధించిన చాసిస్, ఇంజిన్ నంబర్లు చెల్లనివిగా గుర్తించారు.
అనంతరం వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయగా, వాహనంపై చాసిస్ నంబర్ ME4JF50CACJT058118, ఇంజిన్ నంబర్ JF50ET7058179 ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని విచారించగా, గతంలో తన వద్ద ఉన్న Passion Pro మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్ AP01AE1611ను ఆధారంగా చేసుకుని, ప్రస్తుత ఆక్టివాకు రిజిస్ట్రేషన్ చేయించకుండా TS01AE1611 అనే నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడుపుతున్నట్లు అంగీకరించాడు.
పోలీసులు ఆన్‌లైన్‌లో TS01AE1611 నంబర్‌ను పరిశీలించగా, ఆక్టివా వాహనానికి సంబంధించిన వివరాలు లభించలేదు. నకిలీ నంబర్ ప్లేట్‌తో నడుపుతున్న బ్రౌన్ రంగు Active 5G వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. సునీల్ కుమార్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను వెంట ఉంచుకోవాలని, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను అక్రమంగా ఉపయోగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
వృద్ధురాలిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్
రూ.4,000 పెన్షన్ డబ్బులు మంజూరు చేస్తానని రూ.2,000 తీసుకుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
వృద్ధురాలిని నమ్మించి పెన్షన్ డబ్బులు తీసుకున్న నిందితుడు
బ్యాంకు నుంచి నగదు తీసుకున్న సమయంలో మాటలతో మభ్యపెట్టి మోసం
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.4,000 పెన్షన్ డబ్బులు మంజూరు చేస్తానని నమ్మించి 65 ఏళ్ల వృద్ధురాలి వద్ద నుంచి రూ.2,000 నగదు తీసుకుని మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. సునీల్ కుమార్ తెలిపారు.అందహరే అనిల్ తండ్రి గుణ వంతరావు వయస్సు 32 సంవత్సరాలు, కులం: మాంగ్, వృత్తి: కూలీ, నివాసం: భీమ్‌నగర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్
పోలీసుల కథనం ప్రకారం అనుకుంట గ్రామానికి చెందిన తోడసం లక్ష్మి భర్త అర్జున్ తన పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు ఆదిలాబాద్‌కు వచ్చింది. వినాయక్ చౌక్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.2,000 పెన్షన్ డబ్బులు తీసుకుంది. అనంతరం ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకు మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయం వెనుక రోడ్డుపై నిందితుడు ఆమెను పలకరించాడు.
నిందితుడు ఆమె ఎక్కడికి వెళ్తున్నారని, ఎంత పెన్షన్ డబ్బులు తీసుకున్నారని అడిగి తెలుసుకున్నాడు. ఆమె రూ.2,000 తీసుకున్నట్లు చెప్పడంతో, “మీకు రూ.4,000 పెన్షన్ డబ్బులు మంజూరు కావాలి. బ్యాంకు వారు రూ.2,000 మాత్రమే ఇచ్చారు. బ్యాంకు మేనేజర్‌ను అడిగి మిగిలిన రూ.4,000 ఇప్పిస్తాను” అంటూ ఆమెను నమ్మించాడు.
అతని మాటలను నమ్మిన బాధితురాలు తన వద్ద ఉన్న రూ.2,000 నగదును నిందితుడికి ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను విద్యార్థి కాలేజీ సమీపంలోని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి, మిగిలిన రూ.4,000 తీసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ నిందితుడు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
వృద్ధులు, మహిళలు బ్యాంకుల నుంచి నగదు తీసుకున్న సమయంలో అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మవద్దని వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. సునీల్ కుమార్ సూచించారు. పెన్షన్ లేదా ఇతర ప్రభుత్వ పథకాల డబ్బుల విషయంలో అనుమానం ఉంటే నేరుగా సంబంధిత బ్యాంకు లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని తెలిపారు. మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Comments