సెప్టెంబర్ 17..అణచివేతపై పోరాటం..
1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలు విముక్తి పొందిన చారిత్రక ఘట్టం. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉంది.1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచిభారతదేశం స్వాతంత్ర్యం పొందింది. దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నసమయంలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం నిజాం పాలనలోనే కొనసాగారు. నిరంకుశ పాలన, పన్నుల భారం, అణచివేత, భయాందోళనల మధ్య ప్రజలు జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత ఉపఖండంలో 565 సంస్థానాలు ఉండేవి వాటిలో చాలా సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కాగా జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల విలీనం ప్రత్యేక పరిస్థితులకు దారితీసింది. జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ సమస్యలు చివరకు విలీన ప్రక్రియ ద్వారా పరిష్కారమయ్యాయి. హైదరాబాద్ నిజాం మాత్రం స్వతంత్రంగా కొనసాగాలని భావించారు.
నిజాం స్వతంత్ర వైఖరి సైనిక సన్నాహాలు:
1947 ఆగస్టు 15న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా కొనసాగించాలని భావించారు. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచేందుకు నిజాం ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.
1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు 13 నెలల పాటు నిజాంప్రభుత్వం,రజాకార్లదౌర్జన్యాలు, హింస ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.
హైదరాబాద్ సంస్థానంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయడాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ దారుస్సలాంలో ఉపన్యసిస్తూ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేయగలమని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
కాసిం రజ్వీని నిజాం రాజ్యంలో ముస్లింలు పవిత్ర యుద్ధ యోధుడిగా పిలిచేవారు.విదేశీ మార్గాల ద్వారా ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నములో బాగంగా గోవా ద్వారా ఆయుధాలను తెప్పించే ప్రయత్నాలు కూడా చేశారు.
హైదరాబాద్ నిజాం తరఫున మీర్ లాయక్ అలీ, మహమ్మద్ అలీ జిన్నా నుంచి సహాయం కోరగా భారత సైన్యాన్ని కొంతకాలం నిలువరించగలిగితే సహాయం అందిస్తాననీ తెలిపారు.
నిజాం ప్రభుత్వం సైనిక సన్నాహాలు చేస్తుండగా మరోవైపు రజాకార్ల కార్యకలాపాలు తీవ్రరూపం దాల్చాయి.
తెలంగాణ రైతాంగ పోరాటం:
నిజాం పాలనలోని భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణలో రైతాంగ పోరాటం కూడా ఉధృతమైంది. వెట్టిచాకిరీ, అధిక పన్నులు, భూస్వాముల దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు, గ్రామీణ ప్రజలు సంఘటితమై పోరాటం సాగించారు.
ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం రజాకార్లను ఉపయోగించిది దీంతో తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, బాధ్యతాయుత పాలన కోసం ప్రజా పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది.
రజాకార్ల దౌర్జన్యాలు.. దురాగతాలు
కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు నిజాం పాలనకు మద్దతుగా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నించారు. గ్రామాలపై దాడులు, బలవంతపు వసూళ్లు, హింసతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. ముఖ్యంగా హిందువులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు.
గ్రామాల్లో దోపిడీలు దమనకాండ:
తెలంగాణలోని వందలాది పల్లెలపై రజాకార్లు దాడులకు పాల్పడినట్లు చారిత్రక వర్ణనలు పేర్కొంటాయి. గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను తగలబెట్టడం, ప్రజల ఆస్తులు, పశువులు, ధాన్యాన్ని బలవంతంగా దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిని హతమార్చడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు.
మహిళలపై అమానుష దాడులు:
రజాకార్ల అకృత్యాల్లో మహిళలపై జరిగిన దాడులు అత్యంత విషాదకరమైనవిగా నిలిచాయి. గ్రామాలపై దాడుల సమయంలో మహిళలను అవమానించడం, అపహరించడం, లైంగిక హింసకు పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకొన్నాయి.
కుటుంబ సభ్యుల ముందే మహిళలను అవమానించిన ఘటనలు, నగ్నంగా బతుకమ్మ ఆడించిన సందర్భాలు కోకొల్లలు.
బైరాన్‌పల్లి మరణకాండ:
నిజాం పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి మరణకాండ అత్యంత విషాదకరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.
రజాకార్ల బలవంతపు వసూళ్లు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లి గ్రామస్తులు ఐక్యంగా ఎదిరించారు. గ్రామ రక్షణ కోసం బురుజును నిర్మించుకుని అక్కడి నుంచి దాడులను తిప్పికొట్టారు.
దీంతో నిజాం సైన్యం, రజాకార్లు భారీ సంఖ్యలో గ్రామాన్ని చుట్టుముట్టారు. 1948 ఆగస్టు 27న జరిగిన దాడిలో గ్రామస్తులను అదుపులోకి తీసుకుని కాల్చిచంపిన సంఘటన తెలంగాణ చరిత్రలో నెత్తుటి అధ్యాయంగా మిగిలిపోయింది.
ఈ ఘటనలో 119 మంది గ్రామస్తులు అమరులు అయ్యారు.
అణిచివేతకు ఎదురు నిలిచిన వారి ధైర్యం, స్వేచ్ఛ కోసం చేసిన త్యాగం నేటికీ స్ఫూర్తిదాయకం. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా బైరాన్‌పల్లిలో బురుజు, స్మారక స్థూపం నేటికీ నిలిచి ఉన్నాయి.వారి త్యాగాలను స్మరించుకుంటూ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అమరవీరుల ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం కూడా చేశారు.
బైరాన్‌పల్లి సంఘటనపై కాళోజీ నారాయణరావు రాసిన కవితలోని పంక్తులు ఆ కాలపు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
పరకాల సంఘటన:
1947 సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ జెండా ఎగురవేసేందుకు సుమారు 25 నుంచి 30 గ్రామాల ప్రజలు సమిష్టిగా తరలివచ్చారు. ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలపై నిజాం పోలీసులు, రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారిని చెట్లకు కట్టేసి తుపాకులతో కాల్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనను అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ ఘటనతో పోలుస్తారు.
పరకాల ఊరేగింపుకు దగ్గు వీరగోపాల్ నాయకత్వం వహించారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ‘అమరధామం’గా పిలుస్తారు. అమరుల ప్రాణత్యాగానికి గుర్తుగా అక్కడ సీహెచ్ విద్యాసాగర్ రావు స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
గుండ్రంపల్లి ఘటన:
నిజాం అండతో చెలరేగిన రజాకార్లు సృష్టించిన మారణహోమానికి మరో సజీవ సాక్ష్యం గుండ్రంపల్లి ఘటన. ఈ గ్రామంలో జరిగిన దుశ్చర్యలో సుమారు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బోర్‌వెల్లి సంఘటన:
1948లో రజాకార్లు మహబూబ్‌నగర్‌లోని బోర్‌వెల్లి గ్రామ దళితవాడపై దాడి చేసి మహిళలపై ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు.
ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళలు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
షోయబుల్లా ఖాన్ హత్య:
నిజాం పాలనను తన పత్రిక ‘ఇమ్రోజ్’ ద్వారా ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యానికి, బాధ్యతాయుత పాలనకు మద్దతుగా రచనలు చేసిన జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్‌ను 1948 ఆగస్టులో హత్య చేశారు.
పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోయింది.
ఇలా జరిగిన ఎన్నో దారుణాలు తెలంగాణ ప్రజల్లో రజాకార్లపై తీవ్ర వ్యతిరేకతను పెంచి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రేరేపించాయి.
సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర:
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు.
చర్చలు, దౌత్య ప్రయత్నాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు మరింత దిగజారడంతో హైదరాబాద్‌పై సైనిక చర్యకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాతే 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభమైంది.
సెప్టెంబర్ 13.. ఆపరేషన్ పోలో
మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి నేతృత్వంలోని భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై చర్యలు చేపట్టింది.
భారత సైన్యం నాలుగు దిశల నుంచి హైదరాబాద్ సంస్థానం వైపు ముందుకు కదిలింది. సోలాపూర్, ఔరంగాబాద్, విజయవాడ, ఆదిలాబాద్, కర్నూలు ప్రాంతాల వైపు నుంచి సైనిక దళాలు ముందుకు సాగాయి.
కర్నూలు వైపు నుంచి వచ్చిన భారత సైన్యానికి గద్వాల్ సంస్థానం నుంచి మద్దతు లభించింది. గద్వాల్ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలిపారు.
వనపర్తి సంస్థానం కూడా భారత సైన్యానికి మద్దతు తెలిపింది. ఈ రెండు పరిణామాలు భారత సైన్యానికి అదనపు ధైర్యాన్ని ఇచ్చాయి.
భారత సైనిక చర్య కొద్ది రోజుల్లోనే వేగంగా ముందుకు సాగింది. జహీరాబాద్, సూర్యాపేట వంటి కొన్ని ప్రాంతాల్లో నిజాం సైన్యం, రజాకార్ల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. అనేక ప్రాంతాల్లో పెద్దగా ప్రతిఘటన లేకుండానే భారత సైన్యం ముందుకు కదిలింది.
డెక్కన్ రేడియో ప్రచారం:
యుద్ధ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన డెక్కన్ రేడియో, నిజాం అనుకూల పత్రికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారం చేశాయి.
నిజాం సైన్యం విజయం సాధిస్తుందని, భారత సైన్యం వెనక్కి వెళ్లిపోతుందని ప్రచారం చేసినట్లు కథనాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిజాం సైనికులు గస్తీ, కవాతులు నిర్వహిస్తూ హిందూ ప్రజానీకాన్ని భయపెట్టే ప్రయత్నాలు కూడా చేశారు.
అయినా భారత సైన్యం ముందుకు కదలడంతో పరిస్థితులు నిజాం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి.
నిజాం లొంగుబాటు:
ఆపరేషన్ పోలో ప్రారంభమైన కొద్ది రోజులకే హైదరాబాద్ సంస్థాన సైనిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
1948 సెప్టెంబర్ 17న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తరఫున హైదరాబాద్ సంస్థాన సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎల్డ్రూస్, భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి ముందు లొంగిపోయారు.
సెప్టెంబర్ 18న భారత సైన్యం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. దీంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. నిజాం పాలనకు ముగింపు పలికి ప్రజాపాలనకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రైతులు, ప్రజలు, పాత్రికేయులు, అమరవీరుల త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ ,నిజామాబాద్ ప్రాంతాల్లోనూ పోరాట జ్వాల:
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అనేకమంది వీరులు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడి అమరులయ్యారు.
ఆదిలాబాద్ ప్రాంతం నుంచి :
రాంజీ గోండు:
నిర్మల్ ప్రాంతానికి చెందిన రాంజీ గోండు 1857లో సుమారు వెయ్యి మంది అనుచరులతో నాటి నిజాం సేనలను ఎదిరించి పోరాడి అమరుడయ్యారు. ఆయన పోరాటానికి గుర్తుగా ‘వెయ్యి ఊరులమర్రి’ అనే పేరు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
కొమురం భీమ్:
‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన కొమురం భీమ్ జోడేఘాట్ కొండల్లో నిజాం సేనలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించారు.13 రోజుల పాటు నిజాం సేనలను ఎదుర్కొంటూ పోరాడిన ఆయన వెన్నెల్లో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో రజాకార్ల మూకలు దొంగచాటుగా జరిపిన కాల్పుల్లో అమరుడయ్యారు.
సోనాల మండలానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మణరావు సూర్య, దేవ్ రావ్ సూర్య, నిగ లింగారెడ్డి, ఘన్‌పూర్‌కు చెందిన నామాజీ, బోథ్ మండలానికి చెందిన గుండె రావ్, శంకర రావ్, పుండ్రు రాజారెడ్డి, వెంకట్రావ్ వంటి పలువురు కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
ఇందూరు పోరాట యోధులు:
హనుమయ్య వస్తాద్:
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పూణేలో జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన అనంతరం ఇందూరు యువకులకు కర్రసాము, కత్తిసాము నేర్పించారు. రజాకార్లను ఎదుర్కొనేందుకు చిన్న సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అనేకమంది హిందువులకు రక్షణ కల్పించబడింది.
రాధాకృష్ణ మోదని:
ఆర్య సమాజాన్ని స్థాపించి యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు గోరక్షణకు ప్రాధాన్యతను వివరించారు. 1939 సెప్టెంబర్ 2న నాటి అరబ్బులు, నిజాం అనుచరులు కత్తులతో దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు చారిత్రక వర్ణనలు పేర్కొంటాయి. ఈ ఘటనకు నిరసనగా మూడు రోజుల పాటు నిజామాబాద్ బంద్ జరిగింది.
ఇప్పటికీ ఇందూరులోని రైల్వే బ్రిడ్జి దగ్గర విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.
లక్క కిష్టయ్య:
బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య సుమారు వెయ్యి మంది యువకులతో ఆయుధాలు చేతబట్టి నిజాం దాష్టీకాలకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శన నిర్వహించారు.
ఇలా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది వీరులు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. వారి త్యాగాలు తెలంగాణ విమోచన పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ..
వారి స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం.
మునిగెల శ్రీధర్
ఎం.ఏ., ఎం.ఎస్సీ., బి.ఎడ్.
User
Comment Poster
Excellent Sridhar sir good information for this generation people .You have introduced great heroes to those who had forgotten them.
Reply to This Comment
Comments