ఎస్ ఐ ఆర్ 2026 ప్రక్రియను వేగవంతం చేయండి - ఎన్నికల ముఖ్య అధికారి సి. సుదర్శన్ రెడ్డి

Madupa Santhosh CEO
ADB: ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ వేగవంతం చేయాలి: ఎన్నికల ముఖ్య అధికారి సి.సుదర్శన్ రెడ్డి
ఆదిలాబాదు: అక్షర తెలంగాణ 
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026)లో భాగంగా నోమ్యాపింగ్, అనామలీస్ ఓటర్లందరికీ నిర్ణీత గడువులోగా నోటీసులు జారీ చేసి, హియరింగ్స్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఎస్ఐఆర్-2026 లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, ఇతర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ,  ప్రస్తుతం ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సైతం ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని, ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అక్టోబర్ చివరి వారంలోగా అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ వీసీ హాల్ నుండి హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాలలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఎస్ఐఆర్ నోటీసులు, ప్రక్రియను ఆన్‌లైన్‌లో త్వరగా ప్రాసెస్ చేయలేకపోతున్నామని తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నందున, ఆఫ్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసుకునే ప్రత్యేక ఆప్షన్‌ను కల్పించాలని ఎన్నికల ముఖ్య అధికారిని కోరారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద ప్రియా, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments