ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాలు, నూతన భవనాలు, మరుగుదొడ్లు, పీఎం జన్‌మన్, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, పెండింగ్ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనాల నిర్మాణంలో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష నిధులను సద్వినియోగం చేసుకుని పనులను వెంటనే ప్రారంభించాలని, అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 194 మరుగుదొడ్ల నిర్మాణాలను వచ్చే ఒకటి, రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను కొత్త కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని సూచించారు. కొత్తగా మంజూరైన ఐదు భవనాలతో కలిపి మొత్తం ఆరు జీపీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీవో భవనాల నిర్మాణాలను నవంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మండల ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. భూ సమస్యలు, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై అందే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం స్వీకరించిన అర్జీలపై తదుపరి సోమవారం నాటికి జరిగిన పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ, ఇతర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పెండింగ్ విద్యుత్ బిల్లులు, నూతన విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను ఆకట్టుకునేలా ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ వేయించాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏపీఎంల యూనిఫామ్‌ల పంపిణీని పూర్తి చేసి, ఆన్‌లైన్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని, పాఠశాల యూనిఫామ్‌ల కుట్టివేత పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు.
పీఎం జన్‌మన్, ఉపాధి హామీ పథకాల కింద చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం–ఎస్‌హెచ్‌జీ గోదాముల నిర్మాణాలు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశానికి ముందు బాల్య వివాహాల నియంత్రణపై రూపొందించిన “బాల్య వివాహ ముక్త భారత్” ప్రచార వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ఎయిడ్ (AID) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రచార పోస్టర్ల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి మిల్కా, డీఆర్‌డీఓ రాథోడ్ రవీందర్, డీపీఓ రమేష్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments