రైతన్నకు వ్యవసాయ ఆధునీకరణతోనే మేలుజిల్లా స్థాయి కిసాన్ మేళాలో ఎంపీ గోడం నగేష్

Madupa Santhosh CEO
ADB : రైతన్నకు వ్యవసాయ  ఆధునీకరణతోనే మేలు
జిల్లా స్థాయి కిసాన్ మేళాలో ఎంపీ గోడం నగేష్
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ 
 వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం, రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సమష్టి కృషి అవసరమని ఎంపీ గోడం నగేష్ అన్నారు.
మావల మండల కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్‌లో గురువారం ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎం పి మాట్లాడుతూ, దేశ జనాభాలో సుమారు 80 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉందని
అన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు సంప్రదాయ సాగు విధానాలతో పాటు ఆధునిక సాంకేతికత, శాస్త్రవేత్తల సూచనలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలన్నారు. ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, భూసారం, నీటి లభ్యతకు అనుగుణంగా ఆయిల్‌పామ్‌తో పాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు ఎగుమతి అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఒకే వేదికపై సమావేశమై ప్రభుత్వ పథకాలు, ఆధునిక సాగు విధానాలు, నూతన సాంకేతికతపై అవగాహన పొందేలా కిసాన్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం, ఆయిల్‌పామ్ సాగు, డ్రోన్ సాంకేతికత వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ గిరిజన యువతకు డ్రోన్ ఆపరేషన్‌పై శిక్షణ అందించి, బ్యాంకు రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా తక్కువ వడ్డీతో డ్రోన్లు, ద్విచక్ర వాహనాలు తదితర వ్యవసాయ అవసరాల కోసం రుణ సదుపాయాలు పొందవచ్చని రైతులకు వివరించారు. యాసంగిలో నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా కొత్త గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులపై ఎలాంటి ప్రీమియం భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. రైతుల పొలాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతి గ్రామంలో గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల్లో 50 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించాలని కోరారు. అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు దళారులపై ఆధారపడకుండా మార్కెట్ యార్డులు, మార్కెట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, రైతు భరోసా, రైతు బీమా తదితర ప్రభుత్వ పథకాలు రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని రైతులకు సూచించారు.
అనంతరం ముఖ్య అతిథులు కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలకు చెందిన స్టాళ్లతో పాటు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను సందర్శించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల వినియోగం, రైతులకు అందుబాటులో ఉన్న వివిధ సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బోథ్, ఇచ్చోడ ఆత్మ చైర్మన్లు సంతోష్ రావు, రాజు, నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, ఉద్యాన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్డీఓ రాథోడ్ రవీందర్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య, వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం:జిల్లా కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాదు: అక్షర తెలంగాణ 
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని స్థానిక శాసన సభ్యులు అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధికారులు అతిథులకు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బజార్‌హత్నూర్‌లో ఎస్సీ, బీసీ హాస్టళ్ల నూతన భవనాల నిర్మాణానికి త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో త్వరలోనే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని, కొల్హారిలో హరిరామ్, హరికృష్ణ అందజేసిన గోడౌన్‌ను ఇందుకు సద్వినియోగం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కటి వ్యక్తిగత వికాసం, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సమాచార మార్పిడి నైపుణ్యాలను పెంపొందించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగట్లతో పాటు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ విద్యనభ్యసించాలని సూచించారు. అలాగే కొత్త యూనిఫాంలు, షూలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చి సబ్జెక్టులను క్షుణ్ణంగా అభ్యసించాలని, ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే లక్ష్యంతో కష్టపడి చదవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుంటే తల్లిదండ్రుల పేరుతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల పేరును కూడా నిలబెట్టవచ్చన్నారు. తాను సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని నేడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్టిఫైడ్ ఉపాధ్యాయులు, అత్యుత్తమ బోధన అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ చొరవతో జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని వెల్లడించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ, ప్రవైట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. తల్లితండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. బజార్హత్నూర్ మండలంలో పెండింగ్లో అభివృద్ధి పనులను పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవాటుగా మార్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీతకుమారి, ఏంఆర్ఓ శ్యాంసుందర్, ఎంపిడిఓ మహేందర్, సర్పంచ్ సాయన్న, ఏంఈఓ రాంకిషన్, ఏఏపిసి చైర్మన్ నవనీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమన్న, వార్డెన్ చైతన్య, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
Comments