పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Madupa Santhosh CEO
ADB: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
ఆదిలాబాద్ :అక్షర తెలంగాణ 
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా కళ్ల అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 750 మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 6 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని, అర్హత ఉండి ఏ ఒక్కరికీ పథకం మిస్సయినా, తక్షణమే పరిశీలించి మంజూరు పత్రం అందజేస్తామని భరోసానిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు సైతం మంజుయ్యాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక పాలనకు నిదర్శనమన్నారు. ఆదిలాబాదు జిల్లా విమానాశ్రయం నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మారనున్నాయని, జిల్లా మరింత ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు చేరేలా యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా తొమ్మిది మండలాల పరిధిలో సుమారు 700 మందికి మంజూరు పత్రాలు అందజేస్తున్నామని, అలాగే స్లాబ్ రిప్లేస్‌మెంట్, మొదటి విడత పెండింగ్ బిల్లుల చెల్లింపులు సైతం ప్రక్రియల వారీగా పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ఆరోగ్య పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు, సర్జరీలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు నిరంతరం శ్రమిస్తారని ఆయన భరోసానిచ్చారు.
ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ... సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా, నిజమైన నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. ఇళ్లు లేని పేదవాళ్లను గుర్తించి, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను, విద్యార్థులకు కళ్ళ అద్దాలను  ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే, కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, పిడి హౌసింగ్ శంకర్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, డిఈఓ మాధవి, ఆత్మ చైర్మన్ సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments