వృత్తి నైపుణ్యాలు కలిగిన విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకం - చీఫ్ విప్ మహమ్మద్ అలీ షబ్బీర్

Madupa Santhosh CEO
 ADB: వృత్తి నైపుణ్యాలు కలిగిన విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకం -మహమ్మద్ అలీ షబ్బీర్
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
వృత్తి నైపుణ్యాలకు పెద్దపీట వేయాలి: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్

సమాజ అభివృద్ధిలో వృత్తి నైపుణ్యాలు కలిగిన విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం ఆదిలాబాదు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో శ్రమకు, సాంకేతికతకు రూపమిచ్చిన విశ్వకర్మ  సేవలు చిరస్మరణీయమని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాల ద్వారా భవిష్యత్ తరాలకు వారి సేవలు తెలియజేయవచ్చని, తద్వారా యువత మంచి మార్గాన్ని ఎంచుకునే ఆస్కారం ఉందన్నారు. ప్రతి ఒక్కరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.  సమాజానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న చేతివృత్తుల వారిని అన్నివిధాలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలో విశ్వకర్మ వంశీయుల అభ్యున్నతికి, ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశ్వకర్మ రుణాలను సైతం అందించడం జరుగుతుందని, యువత వారి వృత్తిగత నైపుణ్యాలను మెరుగుపరచుకొని ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.
స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారి సంక్షేమం కోసం అందరం ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
అంతకుముందు అతిథులందరూ కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారీ, ఈడీ మనోహర్, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments