నిర్మల్ : అక్షర తెలంగాణ
విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ.. సన్మార్గంలో నడిపించాలి
ఏఐ యుగంలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యంతో పాటు జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని అందించి, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలని పేర్కొన్నారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, మంచి మార్గంలో పయనించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాలను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చదివి పరీక్షల్లో మార్కులు సాధించడానికే పరిమితం కాకుండా, తాము నేర్చుకున్న విషయాలను వాస్తవ జీవితంలో అన్వయించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థల అభివృద్ధికి నైపుణ్యం కలిగిన మానవ వనరులే ప్రధాన కారణమని, అలాంటి నైపుణ్యాలకు పునాది వేసేది ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వమేనని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. వివిధ అంశాలు, సబ్జెక్టులపై ఆసక్తి పెరిగేలా పుస్తకాలు, విజ్ఞాన వనరులను చదివేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సమాజంపై అవగాహన, శోధనాత్మక దృక్పథం, అభ్యసన సామర్థ్యం, ఆచరణాత్మక ఆలోచనలను విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా మంచి మార్గంలో పయనించేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రోత్సహిస్తూ, అవసరమైన సమయంలో మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్య ద్వారా సమాజంలోని చీకట్లను తొలగించి, జ్ఞానదీపాన్ని వెలిగించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ ఏడాది గణనీయంగా విద్యార్థుల నమోదు పెరగడం, పరీక్ష ఫలితాల్లో మంచి పురోగతి సాధించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో పనిచేసి జిల్లాను విద్యారంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
అనంతరం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, డీఆర్వో రమేష్ రాథోడ్, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పరశురామ్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, దయానంద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: అక్షర తెలంగాణ
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అన్ని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి వ్యక్తికి చేరే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలులో ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, సిపిఓ గంగారెడ్డి, డిఎంహెచ్ఓ రాజేందర్, వ్యవసాయ అధికారి సుజాత, హార్టికల్చర్ అధికారి రమణ, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ అధికారి వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments