జిల్లా లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలి- జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB:జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలి: కలెక్టర్ రాజర్షిషా
 ఆదిలాబాదు: అక్షర తెలంగాణ 

జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం గురుపూజోత్సవ వేడుకలను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 100కి చేరేలా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు బోధన చేయాలని, ఏది మంచో, చెడో విడమర్చి చెప్పాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చూడటంలో విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యవంతం చేయడంలో యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో, ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంచేలా విద్యార్థులకు బోధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు: అక్షర తెలంగాణ 

హైదరాబాద్‌కు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఎక్స్‌పోజర్‌ విజిట్ -జెండా ఊపి బస్సులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు పీఎం శ్రీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఎక్స్‌పోజర్‌ విజిట్‌ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 80 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఐఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులతో కూడిన బస్సు సర్వీసులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ అవకాశాన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించి, పర్యటనలో కొత్త విషయాలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఇలాంటి విహార, విజ్ఞాన యాత్రలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సద్వినయోగాన్ని విద్యార్థులు ఆనందంగా గడపాలని సూచించారు. పర్యటన పూర్తిస్థాయిలో సురక్షితంగా సాగేలా చూసే బాధ్యత వెంట వెళ్తున్న ఐఆర్పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులపై ఉందని, అందరూ క్షేమంగా తిరుగువచ్చి అనుభవాలను పంచుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి, వివిధ మండలాల ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, 20 మంది ఐఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Comments